Share News

నేడు ఉగాది

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:36 PM

ఉగాది అనగానే షడ్రుచులతో చేసే పచ్చడి, పంచాంగ శ్రవణాలు గుర్తొస్తాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రజలంతా క్రోధినామ ఉగాది సంవత్సరాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

నేడు ఉగాది
మహబూబ్‌నగర్‌ మార్కెట్‌లో మామిడాకులు, మామిడి కాయలు కొంటున్న ప్రజలు

పచ్చడి తయారీ కోసం కొత్త కుండల కొనుగోలు

పంచాంగ శ్రవణాలకు ప్రత్యేక ఏర్పాట్లు

ఎన్నికల సీజన్‌ కావడంతో రాజకీయ నాయకుల బలాబలాలపై సర్వత్రా ఆసక్తి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 8: ఉగాది అనగానే షడ్రుచులతో చేసే పచ్చడి, పంచాంగ శ్రవణాలు గుర్తొస్తాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రజలంతా క్రోధినామ ఉగాది సంవత్సరాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సోమవారం అమావాస్య కావడంతో ఆలయాలను శుద్ధి చేశారు. ఈ పండగను ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసి మామిడి తోరణాలు కడతారు. కొత్తకుండలో షడ్రుచులతో పచ్చడి చేస్తారు. పులుపు, వగరు, తీపి, కారం, చేదు, ఉప్పు రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు. పచ్చడి తయారీకి కావలసిన ఐటమ్స్‌ అన్నీ ఒకే దగ్గర ప్యాక్‌ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పచ్చడి తయారీ కోసం కుండలను కూడా అమ్ముతున్నారు. పాలమూరు పట్టణంలోని ప్రధాన రహదారుల అంచున కుంటలు, మార్కెట్‌లో మామిడి ఆకులు, వేప పూత విక్రయిస్తున్నారు. ఉగాది స్పెషల్‌ అయిన భక్షాలను కొందరు ఇళ్లలో చేసుకుంటుండగా.. మరికొందరు మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. భక్షాల తయారీ కోసం ముందుగా ఆర్డర్‌లు ఇస్తున్నారు.

పంచాంగ శ్రవణం

పండుగ సందర్భంగా సాయంత్రం జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు వినిపించనున్నారు. ఇందుకోసం పండితులు, సిద్ధాంతులు పంచాంగాలతో రెడీ అవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సముదాయంలోనూ పంచాంగ శ్రవణం చేయనున్నారు. అధికారులంతా అక్కడే తమ పేరు బలాలు చూసుకోనున్నారు. అదేవిధంగా పట్టణంలోని టీచర్స్‌ కాలనీ రామాలయం, శ్రీనివాస కాలనీలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం, వీరన్నపేట శివాలయం, భగీరఽథ కాలనీ రామాలయం, పద్మావతి కాలనీ కాళికాదేవి ఆలయంతోపాటు మన్యంకొండ, కందూరు, కురుమూర్తి ఆలయాల్లో కూడా పంచాంగశ్రవణాలు చేయనున్నారు.

రాజకీయ సందడి

ఎన్నికల సీజన్‌ కావడంతో పంచాంగ శ్రవణాలు.. ముఖ్యంగా తమ పేరు బలాలను తెలుసుకునేందుకు బరిలో ఉన్న నాయకులు ఉత్సాహం చూపుతుంటారు. తమ పేరిట ఉన్న బలాన్ని బట్టి విజయావకాశాలను అంచనా వేసుకుంటారు. ఆదాయం, ఖర్చు, అవమానం, రాజయోగం వంటి విషయాలు పరిశీలిస్తారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు, వారి పేరు బలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలు, కార్యకర్తలకు ఆసక్తి ఉంటుంది. తమ భవిష్యత్తును నిర్ణయించే ఉగాది పంచాంగ శ్రవణం పేరు బలాలను తెలుసుకునేందుకు నాయకులు ఒకరిద్దరు పండితులతో సమాచారం తెప్పించుకోనున్నారని సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు రానున్న సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు కూడా ఉగాది పంచాంగం పేరుబలాలతో ముందుకు సాగనున్నారు. కొందరికి పేరుబలాలు ఆరు నెలలు బాగుంటే.. ఆ తరువాత బలహీనంగా ఉండొచ్చు. ఇంకొందరికి మొదటి ఆరు నెలలు బలాలు అనుకూలించకపోగా, చివరి ఆరు నెలలు గ్రహాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. అలాంటి వారంతా పోటీ చేసేందుకు ఎన్నికల సమయాన్ని చూసుకుని లెక్కలు వేసుకోనున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:36 PM