నేడే లోక్ సభ పోలింగ్
ABN , Publish Date - May 12 , 2024 | 11:09 PM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు నెల రోజులుగా హోరెత్తించిన ప్రచారానికి తెర పడింది. నువ్వా.. నేనా.. అన్నట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. సవాళ్ళు.. ప్రతి సవాళ్లు చేసుకున్నారు. సై అంటే సై అన్నట్లు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడ్డారు.

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్
పోలింగ్ స్టేషన్‌లకు తరలిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు
వలస ఓటర్ల రాక
పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు
సమస్యాత్మక ప్రాంతాలపై కేంద్ర బలగాల నిఘా
మహబూబ్‌నగర్ పరిధిలో 31 మంది.. నాగర్‌కర్నూల్ పరిధిలో 19 మంది పోటీ
మహబూబ్‌నగర్, మే 12: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు నెల రోజులుగా హోరెత్తించిన ప్రచారానికి తెర పడింది. నువ్వా.. నేనా.. అన్నట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. సవాళ్ళు.. ప్రతి సవాళ్లు చేసుకున్నారు. సై అంటే సై అన్నట్లు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడ్డారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియగా.. నేడు సోమవారం మరికొద్ది సేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పరిధిలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా కేంద్రాలకు కేటాయించిన సిబ్బందిని, ఎన్నికల సామగ్రి ఈవీఎంలు, వీవీపాట్‌లను పంపించారు.
ఓటరు నాడిపై టెన్షన్
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీలలో ఓటరు నాడి ఎటువైపు ఉంటుందోనన్న టెన్షన్ మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి 31 మంది, నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు 19 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలతోపాటు బీఎస్పీ, స్వతంత్రులు కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఓటర్లు ఇలా..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో 16,80,348 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 8,20,016 కాగా, మహిళా ఓటర్లు 8,48,289 మంది ఉన్నారు. ఇతరులు 43 మంది ఉన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో 1,937 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,64,034 మంది ఉండగా, మహిళా ఓటర్లు 8,70,694 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. ఇక్కడ 1,944 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
తరలివస్తున్న వలస ఓటర్లు
ఎన్నికలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వలస ఓటర్లను రప్పిస్తున్నారు. రాను, పోను చార్జీలు ఇస్తామని హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో ఉన్న ఓటర్లను పిలిపిస్తున్నారు. అందుకోసం స్థానిక నాయకులతో మాట్లాడుతున్నారు. దీంతో ఆదివారం చాలామంది వివిధ ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు సొంతూళ్లకు చేరుకున్నారు.
ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎదిర గ్రామస్థుల నిర్ణయం
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ పరిధిలోని నాల్గో వార్డుకు చెందిన ఎదిర గ్రామస్థులు పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న అమర్‌రాజా బ్యాటరీల పరిశ్రమ వల్ల కాలుష్యం వెదజల్లితే తమ గ్రామం పాడవుతుందని చాలా రోజులుగా గ్రామస్థులు ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. అమర్‌రాజా పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 58 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎన్నికల ప్రచారం కూడా జరగడం లేదు. ఎదిరలో 94, 95, 96 బూత్‌లు ఉన్నాయి. 94వ పోలింగ్ బూత్‌లో 1,125 మంది ఓటర్లు ఉన్నారు. 95వ బూత్‌లో 1,350 మంది, 96వ బూత్‌లో 764 మంది చొప్పున మొత్తం 3,299 మంది ఓటర్లు ఉన్నారు. నేడు ఓటింగ్ సందర్బంగా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
భారీ పోలీస్ బందోబస్తు
పార్లమెంట్ ఎన్నికలకు భారీ పోలీ్‌స బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మొహరిస్తున్నారు. రెండు పార్లమెంట్‌ల పరిధిలో దాదాపు ఏడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో వెయ్యి మంది వరకు కేంద్రబలగాలు ఉన్నాయి. కర్ణాటక నుంచి కూడా కొన్ని బలగాలను రప్పించారు. అన్ని పోలింగ్ స్టేషన్‌ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పోలింగ్ స్టేషన్‌లకు 100మీ దూరంలో ఎవరూ గుంపులుగా ఉండటానికి వీలులేదు. పోలింగ్ నిర్వహణ అనంతరం ఈవీఎంలు, వీవీపాట్ స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఎస్పీ హర్షవర్దన్ ఆదేశాలిచ్చారు. డీఐజీ, ఎస్పీలు బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
పార్లమెంట్ ఎన్నికలు సోమవారం జరుగనుండంటంతో సిబ్బంది ఆదివారం సాయంత్రమే సామగ్రితో ఆయా పోలింగ్ స్టేషన్‌లకు బయలుదేరి వెళ్లారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీకి సంబంధించి పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఈవీఎం, వీవీపాట్, ఇతర సామాగ్రి అందజేశారు. 32 బస్సులలో పోలీస్ బందోబస్తుతో వారిని బూత్‌లకు తరలించారు. కలెక్టర్ రవిగుగులోత్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రక్రియ సజావుగా సాగేలా యంత్రాంగం కృషి చేయాలన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. ఉదయం 5:30 గంటలకల్లా అధికారులు పోలింగ్ స్టేషన్‌లకు చేరుకుని మాక్ పోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ సమయంలోగా ఎవరు వచ్చినా వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్నికల అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ ఈవీఎం, ఎన్నికల సామగ్రిని పాలమూరు యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సి ఉంటుందన్నారు. అధికారులు, పోలీసులు ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ట్రైనీ కలెక్టర్ పాల్గొన్నారు.
పట్టణంలోని టీడీగుట్టలో మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ముఖ ద్వారాన్ని పూలతో డెకరేషన్ చేసి, గ్రీన్‌మ్యాట్ పరిచారు.