Share News

జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేదు

ABN , Publish Date - May 22 , 2024 | 11:07 PM

‘జిల్లాలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహాయంతో కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించాం.

జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేదు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- వర్షాలు వచ్చాయి.. వ్యవసాయానికి సిద్ధం కావాలి

- జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల, మే 23 : ‘జిల్లాలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహాయంతో కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించాం. గత ప్రభుత్వ తప్పిదాలతో కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా సమస్య ఉంది. ఎన్నికల కోడ్‌ ముగియగానే పరిష్కరిస్తాం’ అని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. గద్వాల పట్టణంలోని జడ్పీ సమావేశపు హాల్‌లో బుధవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తాగునీటిపై సమీక్ష సందర్భంగా గట్టు, అయిజ ఎంపీపీలు విజయ్‌కుమార్‌, బాలాజీరెడ్డి, కేటీదొడ్డి జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ పలు సమస్యలను లేవనెత్తారు. గట్టు మండలంలోని ముచ్చోనిపల్లి, తప్పెట్లమొర్సు, తుమ్మలపల్లి, అయిజ మండలంలోని రాజాపురం, బైనంపల్లి, భూం పురం గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నదని సభ దృష్టికి తెచ్చారు. రూ.1.89 కోట్ల వ్యయంతో పనులు నిర్వహిస్తున్నామని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మిషన్‌ భగీరథ అధికారి భీమేశ్వర్‌రెడ్డి వివరించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఎవరిని అడిగి ప్రతిపాదనలు తయారు చేశారని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత జిల్లా విద్యాధికారి ఇందరను నిలదీశారు. అత్యవసర పనులను వదిలేసి అవసరం లేని పనులను చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పదవ తరగతి ఫలితాలు కూడా ఆశించినట్లు లేవని నిలదీశారు. దీంతో ఆమె సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా వారు వినిపించుకోలేదు. అనంతరం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ నాణ్యతలేని నకిలీ విత్తనాలపై అధికారులను నిలదీశారు. సీడ్‌ ఆర్గనైజర్ల వద్ద లూజ్‌ సీడ్‌ ఉందని, ఎందుకు వాటిని పట్టుకోవడం లేదని నిలదీశారు. రైతులు బర్రెల దాణా కోసం చెడిపోయిన సీడ్‌ ఉంచుకున్నా, కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో వ్యవసాయ అధికారి గోవిందనాయక్‌ స్పందిస్తూ, పోలీసులతో పాటు తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో వస్తున్నాయని, వ్యవసాయం బాగా ఉంటుందని చెప్పారు. అందుకు తగినట్లుగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచా మని వివరించారు. డీఆర్‌డీవో శాఖపై సమీక్ష సందర్భంగా దివ్యాంగులు స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి రావడం లేదని, ఐదు నిమిషాల్లో క్లోజ్‌ అవుతోందని గద్వాల ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. కొత్త పింఛన్లు కూడా రావడం లేదని వివరించారు.

కోడ్‌ ముగియగానే సమస్యలకు పరిష్కారం

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సమస్యలు పరిష్కారం కావడం లేదని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. కోడ్‌ ముగియగానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలయ్యేందుకు కోడ్‌ అడ్డం కిగా ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించినట్లు జూన్‌ నుంచి సంక్షేమ పథకాలు అన్నీ అమల వుతాయని వివరించారు. జూరాలతో పాటు అన్ని ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీళ్లు వస్తాయని, రైతులు వ్యవసాయానికి సిద్ధంగా ఉండాలని వివరించారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండి ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పాఠ శాలల్లో పనులను పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తామని వివరించారు. అదే విధంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను అందిస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే అన్ని సమస్యలను పరిష్కరిం చేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో కాంతమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 11:07 PM