Share News

వేసవి దుక్కులతో అనేక లాభాలు

ABN , Publish Date - May 30 , 2024 | 10:52 PM

వేసవి దుక్కులు పంట పొలాలకు ఎంతో మేలు చేస్తాయి.

 వేసవి దుక్కులతో అనేక లాభాలు

- లోతు దుక్కులతో చీడపీడల నివారణ

మరికల్‌, మే 30 : వేసవి దుక్కులు పంట పొలాలకు ఎంతో మేలు చేస్తాయి. నాగళ్ల సాళ్లతో భూమి వదులుగా మారి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. చీడపీడల ప్రభావం తగ్గి పంట దిగుబడి పెరుగుతోంది. మరికల్‌ మండలంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతులు వేసవి దుక్కులు దున్నుతున్నారు. పొలాల్లో మిగిలిన వర్థ్యాలను కలియదున్నితే సేంద్రియ ఎరువుగా మారడంతో పాటు మట్టిని పెకిలించడం ద్వారా భూమిలో గాలి శాతం పెరుగుతుంది. లోతుగా దున్నితే తొలకరిపైరు వేసుకునేందుకు అనువుగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దుక్కి దున్నడం వల్ల కలుపు మొక్కలు పైకి లేచి ఎండకు మాడిపోవడం, అదే విధంగా భూమిలో ఉండే పురుగులు పైకి రావడంతో పంట కాలంలో పురుగుల సంతతి కనుమరుగై పైరుకు మేరు జరుగుతోంది. అదే విధంగా వేరు వ్యవస్థ బలపడి పోషకాలు అందుతాయన్నారు.

- గతంలో ఎండాకాలం పొలాల్లో జీవాల మందను ఉంచేవారు. వాటి మలమూత్రాలు పంటల ఎదుగుదలకు ఉపయోగపడేవని రైతులు ఇలా చేసేవారు. ప్రస్తుత రోజుల్లో పశువుల సంఖ్య తగ్గి పొలాల్లో మందను కట్టేయడం తగ్గిపోయింది. కొన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పశువులు, గొర్రెల నుంచి వచ్చే సేంద్రియ ఎరువుల వల్ల పంటల ఎదుగుదలకు ఉపయోగపడి దిగుబడి అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో పొలాల వద్ద సంవత్సరం పొడవునా నిల్వ చేసిన పశువుల ఎరువును ఎండాకాలంలోనే పొలాల్లో వేయాలి. వర్షాలు పడిన తర్వాత ఆ ఎరువులను నేలపై చల్లి ట్రాక్టర్‌తో దున్నడంతో మట్టిలో బాగా కలిసిపోతాయి. దీంతో పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి.

దున్నకుంటే నష్టాలు

కోతల అనంతరం దుక్కిదున్నకుండా వదిలేయడంతో భూమి గాలిని పీల్చుకునే శక్తిని కోల్పోతుంది. అదే విధంగా లోతైన పొరల నుంచి నీరు ఆవిరైపోతోంది. కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూసారాన్ని తగ్గిస్తాయి. విత్తడానికి వారం, పది రోజుల ముందు దుక్కులు తయారు చేయడం వల్ల ఆశించినంత దిగుబడి రాదని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - May 30 , 2024 | 10:52 PM