Share News

రోజు వారి కూలి రూ.300 పడేలా చూడాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:55 PM

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన రోజు వారి కూలీ పడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

రోజు వారి కూలి రూ.300 పడేలా చూడాలి
ఊట్కూర్‌ పెద్ద చెరువు వద్ద ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- పని చేసే చోట కూలీలకు నీరు, నీడ వసతి ఏర్పాటు చేయాలి

- గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూడాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

ఊట్కూర్‌, ఏప్రిల్‌ 6 : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన రోజు వారి కూలీ పడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పెద్దచెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, వరి కొనుగోలు కేంద్రాన్ని, తాగునీటి పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఊట్కూర్‌ పెద్ద చెరువులో పని చేస్తున్న కూలీలతో మాట్లాడి రోజుకు ఎంత కూలీ వస్తుందని తెలుసుకున్నారు. గత వారం ఎంత కూలీ వచ్చిందని అడగగా రూ.120 వచ్చిందని చెప్పారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి ఆదుకుంటుందన్నారు. కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.300 వచ్చేలా కొలతలతో పని చేయించాలన్నారు. పనులకు వచ్చే కూలీల పేర్లు తప్పక నమోదు చేయాలని, పనిచేఏ చోట కూలీలకు నీరు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మగ్దూంపూర్‌ రోడ్డు, చెక్‌పోస్టు వద్ద కొనసాగుతున్న నీటి పైపులైన్‌ పనులను పరిశీలించారు. గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకటేష్‌కు సూచించారు. నీటిని వృథా కాకుండా చూడాలన్నారు. అలాగే మార్గ మధ్యలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న రైస్‌ మిల్లులను తనిఖీ చేసి స్టాక్‌ వివరాలు తెలుసుకున్నారు. రైస్‌ మిల్లులు బాకి ఉన్న సీఎంఆర్‌ను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అలాగే బాపూర్‌ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వ్యవసాయ అధికారితో మాట్లాడారు. ఎంత వడ్లు రావచ్చని అధికారులను అడగా బయట రేటు ఎక్కువ ఉండటంతో ఆరు వేల క్వింటాళ్ల దాక రావచ్చు అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డిప్యూటీ శ్రీనివాస్‌, ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్‌, ఎంపీవో ఎన్‌ఎంఎన్‌ రాజు, ఏపీవో సత్యప్రకాష్‌, ఏవో గణేష్‌రెడ్డి, సింగిల్‌ విండో కార్యదర్శి హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 10:55 PM