Share News

సంగంబండ తొలగింపునకు రంగం సిద్ధం

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:43 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంగంబండ రిజర్వాయర్‌లోని బండ తొలగింపునకు రంగం సిద్ధమైంది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈనెల 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బండ తొలగింపునులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

సంగంబండ తొలగింపునకు రంగం సిద్ధం
సంగంబండ రిజర్వాయర్‌ సమీపంలో తొలగించాల్సిన బండ రాయి ఇదే..

బాధితులకు అందిన పరిహారం

రేపు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం, నీటి పారుదల శాఖ మంత్రి

మక్తల్‌, మార్చి 11: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంగంబండ రిజర్వాయర్‌లోని బండ తొలగింపునకు రంగం సిద్ధమైంది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈనెల 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బండ తొలగింపునులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బండ తొలగించకపోవడంతో ఎడమ లో లెవల్‌ కాల్వ పనులు పూర్తికాక, 11 గ్రామాల పరిధిలో దాదాపు ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందటం లేదు. భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్‌ను 3.317 టీఎంసీల సామర్థ్యంతో 75 వేల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో చేపట్టారు. రిజర్వాయర్‌ హైలెవల్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటి వరకు మక్తల్‌, నర్వ, ఆత్మకూర్‌ మండలాల పరిధిలో 70 చెరువులను నింపుతున్నారు. కుడి కాల్వ ద్వారా మాగనూరు మండల పరిధిలో ఎనిమిది వేల ఎకరాలకు నీరిస్తున్నారు. కొన్ని చెరువులకు కూడా నింపుతున్నారు. కానీ ఎడమ లో లెవల్‌ కెనాల్‌ పనులు పూర్తికాక మక్తల్‌ మండలంలోని గుర్లపల్లి, దాసర్‌పల్లి, వనాయకుంట, తిర్లపుర్‌, చందాపూర్‌, మాగనూరు మండలంలోని పెగడబండ, ఓబ్లాపూర్‌, పర్మాన్‌దొడ్డి, వడ్వాట్‌ గ్రామాల పరిధిలో ఏడు వేల ఎకరాలకు నీరు అందడం లేదు. సంగంబండ గ్రామానికి అతి చేరువలో 400ల మీటర్ల వెడల్పు ఉన్న బండరాయిని తొలగిస్తేనే ఈ కెనాల్‌ ద్వారా నీరందించడం సాధ్యమౌతోంది. ఈ పనులు చేపట్టేందుకు అప్పట్లో గుత్తేదారు వెళ్లగా.. సంగంబండ గ్రామస్థులంతా అడ్డుకున్నారు. తమకు పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని చెప్పారు. ఎట్టకేలకు పరిహారం డబ్బులు పంపిణీ చేయడంతో బండ తొలగించేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. గుర్లపల్లి, వనాయకుంట, దాసర్‌పల్లి గ్రామాల సమీపంలో వంతెనల పనులు కూడా అసంపూర్తి దశలో ఉన్నాయి. సంగంబండ ప్రాజెక్టు ద్వారా ఏడేళ్ల నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న నర్వ, ఆత్మకూర్‌ వంటి ప్రాంతాలకు నీరు వెళ్తున్నా.. బండ అడ్డుగా ఉండటంతో కూత వేటు దూరంలో ఉన్న తమకు మాత్రం అందడం లేదని సంగంబండతో పాటు పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. బండను తొలగించనుడటంతో లో లెవల్‌ కెనాల్‌ పరిఽధిలోని 11 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 10:43 PM