Share News

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:02 PM

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, 24 గంటలు సేవలు అందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
సురవరం సాహితీ కళాభవన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

- రోగులకు 24 గంటలూ మెరుగైన వైద్య సేవలు అందించాలి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- ఎంసీహెచ్‌ ఆకస్మిక తనిఖీ

వనపర్తి వైద్య విభాగం, జూలై 31 : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, 24 గంటలు సేవలు అందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రం లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసు కున్నారు. చిన్నపిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్రచి కిత్సల వార్డు, ఎస్‌ఎన్‌సీయూ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న బెడ్‌ల వివరాలు, వివిధ రకాల రిజిస్టర్లను సరి చూశారు. రోజుకు ఎన్ని ఓపీ లు నమోదు అవుతున్నాయి.. ప్రసవాలు ఎన్ని, ఇతర ఆసుపత్రులకు రెఫర్‌ చేసిన రిజిస్టర్‌ను పరిశీలించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రైవేటు ఆసుపత్రులకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అధికంగా జరిపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ బంగారయ్య, గైనకాలజిస్టు డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ అరుణకుమారి, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

మార్కెట్‌ భవనాలు వినియోగంలోకి తేవాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా : కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని సదుపాయాలతో నిర్మించిన ఆధునిక సమీకృత మార్కెట్‌, వే సేడ్‌ మార్కెట్‌ భవనాలను ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మార్కెటింగ్‌ శాఖ అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. బుధవారం పెబ్బేరు రోడ్డులో 1.6 ఎకరాల స్థలంలో రూ.2.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక వే సైడ్‌ మార్కెట్‌ను అదనపు కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. హోల్‌సేల్‌ కూరగాయలు అమ్మే వ్యాపారులు, రైతులు స్వయంగా పండించిన కూరగాయలు, పళ్లు అమ్ముకునే వారికి ఈ వే సైడ్‌ మార్కెట్‌లో ఉచితంగా షాపులు కేటాయించాలని సూచించారు. ఇక నుంచి వనపర్తి పట్టణంలో రోడ్డు పక్కన హోల్‌సేల్‌ కూరగాయలు అమ్మడానికి వీలు లేదని, కూరగాయలు అమ్మే సంఘాల వారితో మాట్లాడి వే సైడ్‌ మా ర్కెట్‌కు తరలించాలని చెప్పారు. అనంతరం పట్టణంలో రూ.19.50 కోట్ల వ్యయంతో 2.4 ఎకరాల స్థలంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత మార్కెట్‌ భవనాన్ని పరిశీలించారు. కూరగాయలు, పండ్లు రిటైల్‌గా అమ్మే వ్యాపారులకు ఈ షాపులు ఉచితంగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మటన్‌, చికెన్‌ వ్యాపారులు బయట అమ్ముకోకుండా సమీకృత మార్కెట్‌లో అన్ని సదుపాయాలతో నిర్మించిన షాపులను కేటాయించాలని సూచించారు. తర్వాత సురవరం సాహితీ కళాభవన్‌ను పరిశీలించిన కలెక్టర్‌ అందులో అవసరమైన ఫర్నిచర్‌, ఇతర సదుపాయాల ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా మార్కెటింగ్‌ అధికారి స్వరణ్‌సింగ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీరాజ్‌ కార్యనిర్వాహక ఇంజనీర్‌ మల్లయ్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఏకరూప దుస్తులు అందించాలి..

విద్యార్థులకు రెండవ జత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, ఇంజనీ రింగ్‌ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన రెండవ జత ఏకరూప దుస్తులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష నిర్వహించారు. మొదటి జత ఏకరూప దుస్తు లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థికి చేరాయా అని అధికారులను ప్రశ్నించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద మిగిలిపోయిన పాఠశాలల్లో పను లను త్వరగా పూర్తి చేయాలని, వందశాతం పూర్తయిన వాటికి బిల్లులు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లోకల్‌ బా డీస్‌ సంచిత్‌ గంగ్వార్‌, ఆర్డీవో పద్మావతి, డీఈవో గోవిందరాజులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సీఎం అభినందన సభకు ఏర్పాట్లు

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ఆగస్టు 2న హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌శాస్ర్తి స్టేడియంలో ముఖ్యమంత్రి అభినందన సభ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపా ధ్యాయులను తరలించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫ రెన్స్‌ హాల్లో జిల్లా విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికా రులు, మండల విద్యాధికారులతో సమావేశం నిర్వ హించిన కలెక్టర్‌ అభినందన సభకు జిల్లా నుంచి 550 మంది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మఽధ్యా హ్నం 12:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఉదయం 6:30 గంటలకు పాలిటెక్నిక్‌ కళాశాల మైదానానికి చేరుకోవాలని, 7:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు.

రోడ్ల విస్తరణ సమస్యలపై నివేదిక ఇవ్వండి..

జిల్లాలోని రోడ్లు, రోడ్ల విస్తరణకు సంబంధించిన సమస్యలు ఉంటే నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో రోడ్లు భవనాల ఇంజనీరింగ్‌ అధికారులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌తో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులు, రోడ్డు విస్తరణకు ఉన్న ఆటంకాలు, ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న ఆటంకా లను అధిగమించి పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మిగిలిన సమస్యలు ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌తో పాటు, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ దేశ్యనాయక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:02 PM