Share News

కొత్త కాలనీల్లో సమస్యల తిష్ఠ

ABN , Publish Date - May 14 , 2024 | 10:48 PM

అయిజ మునిసిపాలిటీ పరిధిలోని కొత్త కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

కొత్త కాలనీల్లో సమస్యల తిష్ఠ
భరత్‌నగర్‌ కాలనీలో రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు లేని ఓ వీధి

- ఏళ్లు గడుస్తున్నా కనీస వసతులు కరువు

- రోడ్లు, డ్రైనేజీలు లేక స్థానికుల అవస్థలు

అయిజ టౌన్‌, మే 14 : అయిజ మునిసిపాలిటీ పరిధిలోని కొత్త కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పట్టణంలోని బీసీ కాలనీ, మైలోనిగడ్డ, భరత్‌నగర్‌, టీచర్సు కాలనీ తదితర కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కాలనీలు ఏర్పడి ఏళ్లు గడిచినా అంతర్గత రహదారులు, మురుగు కాలువలను నిర్మించలేదు. విద్యుత్‌, తాగునీరు సౌకర్యాలు కూడా సక్రమంగా లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కాలనీలు ఏర్పడి 15 సంవత్సరాలు గడిచినా కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించుకున్నా అంతర్గత రహదారులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు మురుగుకాలువలు లేక మురుగు నీరు, వర్షపు నీరు ఇళ్ల ముందే నిలుస్తుంది. దీంతో దోమల బెడద తీవ్రమై స్థానికులు అనారోగ్యం బారిన పడు తున్నారు. ఇప్పటివరకు కాలనీల్లో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయలేదు. కొన్ని కాలనీల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని కాలనీల్లో విద్యుత్‌ స్తంభాలున్నా వీధి లైట్లు బిగించలేదు. దీంతో రాత్రి వేళ కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే సర్వీస్‌ వైర్లను కర్రల మీదుగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని, కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

మునిసిపాలిటీలో నిధులు లేవు

అయిజ మునిసిపాలిటీలో నిధులు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త కాలనీల్లో సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేస్తే పనులు చేపడతాం. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తే, వెంటనే కొత్త కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడతాం.

- దేవన్న, మునిసిపల్‌ చైర్మన్‌, అయిజ

Updated Date - May 14 , 2024 | 10:48 PM