Share News

విద్య, వైద్యంపైనే ప్రధాన దృష్టి

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:45 PM

పాలమూరు జిల్లాను రాష్ట్రానికే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశనం చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు.

విద్య, వైద్యంపైనే ప్రధాన దృష్టి
సోమవారం సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం సూచన

జాతీయ రహదారిపై 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, ఇబ్బందుల పరిష్కారానికి చొరవ

త్వరలో ప్రతీ అసెంబ్లీకి రూ.10 కోట్లు

మహబూబ్‌నగర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): పాలమూరు జిల్లాను రాష్ట్రానికే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశనం చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, నియోజకవర్గాల వారీగా చేపట్ట్టాల్సిన పనులు, ఇతర ప్రగతిపై సీఎం ఎమ్మెల్యేలతో చర్చించారు. పలువురు ఎమ్మెల్యేలు తెలిపిన ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో విద్య, వైద్య రంగాల పనులు ప్రథమ ప్రాధాన్యంతో చేపట్టాలని సీఎం సూచించారు. ఇటీవల బాలానగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సీఎం జాతీయ రహదారిపై ప్రమాదాల నిరోధానికి అవసరమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్న ప్రకారం జాతీయ రహదారిపై ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్‌ సెంటర్‌ కు చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. బాలానగర్‌, జడ్చర్ల, జానంపేటతో పాటు అలంపూర్‌ వరకు మరో రెండు చోట్ల ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలిస్తామని వెల్లడించారని తెలిపారు. పూర్వపు జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో త్రిపుల్‌ ఐటీ విద్యా సంస్థ, నాలెడ్జి సెంటర్‌, ఇంజనీరింగ్‌ కాలేజీ, ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి కోరగా, సీఎం అంగీకరించారని తెలిపారు. అదేవిధంగా జడ్చర్లలో గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు ఎమ్మెల్యే అనిరుధ్‌ కోరారు. మొత్తం నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, పునరుద్ధరణ, మరమ్మతులపై ప్రతిపాదనలను తయారు చేసి నివేదిస్తే, సంబంధిత శాఖ ద్వారా నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ రోడ్ల మరమ్మతులపై ప్రతిపాదనలు రూపొందించేందుకు అధికారులకు సూచించాలని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరగా, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, శ్రీహరి, రాజేశ్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి తమ తమ నియోజకవర్గాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల ఏర్పాటు, సాగునీటి అంశాలపై ప్రస్తావించగా, అన్నింటిపైనా సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి.. ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనరసింహ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తే పనుల మంజూరుకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గానికి త్వరలో రూ.10 కోట్ల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని సూచన

పాలమూరు అభివృద్ధే ఏకైక లక్ష్యంగా ఎమ్మెల్యేలంతా జనంలోనే ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారని తెలిసింది. ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, సీనియర్‌ నాయకుల సలహాలు, సూచనలతో పని చేసుకోవాలని చెప్పారని సమాచారం. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లను గెలవడమే లక్ష్యంగా క్యాడర్‌ను సమాయత్తం చేయాలని స్పష్టంగా ఆదేశించారని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ధేశిస్తే వారి గెలుపే అందరి లక్ష్యం కావాలని సూచించినట్లు చెబుతున్నారు. అధికారులు, ఉద్యోగులతో సమన్వయంతో వ్యవహరించి నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించాలని.. ప్రజలకు సేవలందించాలని సీఎం రేవంత్‌ జిల్లా ఎమ్మెల్యేలకు మార్గనిర్ధేశనం చేశారని సమాచారం. అధికారులు, ఉద్యోగులు, పోలీసుల నియామకాల విషయంలో బంధుప్రీతికి, అనుచరులు, స్నేహితుల ఒత్తిళ్లకు లొంగవద్దని, సిన్సియర్‌గా పనిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిసింది.

Updated Date - Jan 09 , 2024 | 10:45 PM