Share News

ప్రభుత్వం మీకోసమే పని చేస్తుంది

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:51 PM

మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే వినియోగిస్తాం.. మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు కోరుకుని ఆశీర్వదించిన ప్రభుత్వం మీ కోసమే పని చేస్తుంది. బూర్గుల రామకృష్ణారావు తరువాత మళ్లీ పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం రావడం మీ అదృష్ఠం. రాష్ట్ర కేబినెట్‌ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. పాలమూరు అభివృద్ధి విషయంలో పది రూపాయలు ఎక్కువ ఖర్చు చేసినా అభ్యంతరం లేదని చెప్పాం.

ప్రభుత్వం మీకోసమే పని చేస్తుంది
చేపల స్టాల్‌ను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ

పాలమూరులో సంక్రాంతికి ముందే రైతు పండగ

ఆయిల్‌పామ్‌లో లాభాలిచ్చే బాధ్యత మాది

పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌ను ఆశీర్వదించండి

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

ప్రారంభమైన మూడు రోజుల రైతు సదస్సు

ఆకట్టుకుంటున్న స్టాళ్లు

అధిక సంఖ్యలో తరలొచ్చిన రైతులు

మహబూబ్‌నగర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే వినియోగిస్తాం.. మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు కోరుకుని ఆశీర్వదించిన ప్రభుత్వం మీ కోసమే పని చేస్తుంది. బూర్గుల రామకృష్ణారావు తరువాత మళ్లీ పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం రావడం మీ అదృష్ఠం. రాష్ట్ర కేబినెట్‌ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. పాలమూరు అభివృద్ధి విషయంలో పది రూపాయలు ఎక్కువ ఖర్చు చేసినా అభ్యంతరం లేదని చెప్పాం. పాలమూరుకు ఇదివరకు ఉన్న పేరుపోవాలని పాలమూరు అంటే వలసల జిల్లా కాదు.. ఆ జిల్లాకే వలసలు వచ్చేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ శివారులో మూడ్రోజులపాటు నిర్వహించనున్న రైతు పండగ సదస్సు గురువారం ప్రారంభమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, పద్మశ్రీ చింతల వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, జిమధుసూదన్‌రెడ్డి ఈ పండగను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అప్పులున్నా, డబ్బులు లేకపోయినా ఏదోరకంగా రైతు కార్యక్రమాలన్నీ అమలు చేయాలన్న తాపత్రయం ఉన్న ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలు ఉన్నాయని, ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే మొదటి మూడేళ్లు పెట్టుబడి పెట్టే బాధ్యత తమదేనన్నారు. అందులో అంతర్‌ పంటలను సాగు చేస్తే వాటికి కూడా బోనస్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఎవరికీ తలవంచని పంట ఫామ్‌ఆయిల్‌ అని, మీ బతుకుల్లో వెలుగులు నింపకపోతే వ్యవసాయశాఖ మంత్రిగా మీరు ఏ శిక్ష వేసినా సిద్ధంగా ఉంటానన్నారు. రాజకీయ నాయకులంతా రైతు బిడ్డలేనని, అధికారంలోకి వచ్చాక అన్ని మరిచిపోతుంటామని చెప్పారు. 30న జరిగే సీఎం రైతు సదస్సు ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని, పాలమూరుకు సంక్రాంతికి ముందుగానే రైతుపండగ వచ్చిందని అన్నారు.

ఆధునిక పద్ధతులు పాటించాలి: మంత్రి దామోదర

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 117 స్టాళ్లతో ఏర్పాటు చేసిన కార్యక్రమం పండగను తలపిస్తుందన్నారు. ఇంత మంచి కార్యక్రమం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. 2004లో వ్యవసాయం దండగ అన్న భావన ఉండగా, అప్పుడు వ్యవసాయం దండగకాదు పండగ అన్న నినాదం కాంగ్రెస్‌ తీసుకుందన్నారు. కాంగ్రెస్‌ తరువాత వచ్చిన ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్లీ రేవంత్‌రెడ్డి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళిక రూపొందించారన్నారు. ఆధునిక వంగడాలు, పద్ధతులపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు రైతలుకు అవగాహన కల్పించాలన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులకిచ్చిన హామీల అమలు: మంత్రి జూపల్లి

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రూ.60 వేల కోట్లు వడ్డీకే చెల్లించామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి రైతులకిచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీతో పాటు సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నారని అన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, లాభాలు సాధించే పంటలపై అవగాహన కల్పించేందుకే పెద్దఎత్తున స్టాళ్ళను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ విజయేందిరబోయి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ గోపి, సెరికల్చర్‌ డైరెక్టర్‌ యాష్మిన్‌భాష, ఎస్పీ జానకి, నాయకులు ఒబేదుల్లా కొత్వాల్‌, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:51 PM