సుంకేశుల జలాశయానికి పెరిగిన వరద నీరు
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:25 PM
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి శుక్రవారం వరద నీరు పెరిగిందని సుంకేసుల డ్యాం జేఈ రాజు తెలిపారు.
- గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
రాజోలి, జూన్ 14 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్ర శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి శుక్రవారం వరద నీరు పెరిగిందని సుంకేసుల డ్యాం జేఈ రాజు తెలిపారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం ఉదయం డ్యాంకు 1600 క్యూసెక్కులు ఉన్న వరద సాయంత్రానికి 4,500 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వచ్చి చేరుకుంది. దీంతో శుక్రవారం సాయంత్రం సుంకేసుల జలాశయం నుంచి ఒక గేటును ఒక మీటర్ ఎత్తుకు తెరిచి 4,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.026 టీఎంసీలుగా ఉందని, నీటి నిల్వ 292.00 మీటర్లు కాగా ప్రస్తుతం 291.50 మీటర్లు నమోదు అయినట్లు డ్యాం జేఈ రాజు వివరించారు. నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకూడదని, రాత్రికి మరీ పెరిగే ఆవకాశం ఉందని ఆయన తెలిపారు.
జూరాలకు కొనసాగుతున్న ప్రవాహం
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగడంతో ప్రాజెక్టులో నాలుగు టీఎం సీల మేర నీటి నిల్వ చేరుకుంది. ఎగువనున్న ఆల్మట్జి జలాశయంలో 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, దిగువనున్న నారాయణపూర్ జలాశయంలో 24.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల జలాశయంలో 317.270 మీటర్లలో నీటి నిల్వ ఉండగా, ప్రాజెక్టులో 4.561 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. ప్రాజెక్టులో 6,558 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదు కాగా, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 354 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 568, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 230, ఆవిరి రూ పంలో 128 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, మొ త్తం ప్రాజెక్టు నుంచి 1280 క్యూసెక్కుల నీరు దిగువ కు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.