Share News

టైగర్‌ సఫారీకి క్రేజ్‌

ABN , Publish Date - May 30 , 2024 | 11:22 PM

నల్లమలలో టైగర్‌ సఫారీకి క్రేజ్‌ పెరుగుతోంది.

టైగర్‌ సఫారీకి క్రేజ్‌
నల్లమలలో జంగిల్‌ సఫారీ చేస్తున్న పర్యాటకులు (ఫైల్‌)

- 2021 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా 14 వేల మంది, ఆఫ్‌లైన్‌ ద్వారా 20 వేల మంది టిక్కెట్ల బుకింగ్‌

- జూలై మొదటి నుంచి అక్టోబరు చివరి దాకా విరామం

- కొనసాగుతున్న ఆన్‌లైన్‌ బుకింగ్‌

- పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం : డీఎఫ్‌వో రోహిత్‌

నాగర్‌కర్నూల్‌/మన్ననూర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : నల్లమలలో టైగర్‌ సఫారీకి క్రేజ్‌ పెరుగుతోంది. అభయారణ్యంలో వన్యప్రాణులను నేరుగా చూసే అవకాశం ఉండటంతో పర్యావరణ ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం 2,166 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉన్నది. అచ్చంపేటలో నాలుగు రేంజ్‌లు ఉండగా అమ్రాబాద్‌లో మరో నాలుగు, నాగార్జున సాగర్‌లో మూడు రేంజ్‌లు ఉన్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో 25 నుంచి 30 పెద్దపులులు, 150 దాకా చిరుతలు ఉండవచ్చునని అధికారుల అంచనా. వీటితో పాటు జింక లు, దుప్పులు, మనబోతులు, గుర్రజింక అడవి పందులు, మూసిక జింకలు, అడవి కోళ్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. అయితే అటవీ ప్రాంతంలో సంచరించడంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉండటంతో వాటిని నేరుగా చూసే అవకాశం గతంలో ఉండేదికాదు.

టైగర్‌ సఫారీ చేయాలంటే....

నల్లమలలో 2021 నుంచి టైగర్‌ సఫారీని ప్రారంభించడంతో పర్యాటకుల నుంచి విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. నల్లమలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో టైగర్‌ సఫారీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ ఏటా జూలై మొదటి వారంనుంచి అక్టోబరు చివరి వరకు పులులు గర్భందాల్చే సమయంలో నల్లమలలో సంచారాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిషేధిం చింది. మిగతా తొమ్మిది నెలల పాటు నల్లమలలో టైగర్‌ సఫారీకి ఎలాంటి ఆంక్షలు లేవు. ఇందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో బుకింగ్‌ ఏర్పాటు చేశారు. 2021 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా 14 వేల మంది, ఆఫ్‌లైన్‌ ద్వారా 20వేల మంది పర్యాటకులు టికెట్లు బుకింగ్‌ చేసుకున్నారు. టైగర్‌ సఫారీకి 17 వాహనాలు సమకూర్చారు. 14 మంది చెంచు యువకులు గైడ్‌లుగా వ్యవహరిస్తూ అటవీ ప్రాంతంలో ఆయా ప్రదేశాలకు ఉన్నప్రాధాన్య తను వివరిస్తున్నారు. టైగర్‌ సఫారీకి ఆన్‌లైన్‌లో రూ. 5,100 నుంచి రూ. 8,500 వరకు ప్యాకేజీని నిర్ణయించారు. ఆఫ్‌లైన్‌లో ఫర్హాబాద్‌ చౌరస్తా నుంచి రూ.2 వేల ధర నిర్ణయించారు. టైగర్‌ సఫారీకి వచ్చే పర్యాటకులు బస చేసేందు కు 12 కాటేజీలను నిర్మించారు.

పర్యటన వివరాలు ఇలా..

నల్లమలలో టైగర్‌ సఫారీ చేయడానికి బుక్‌ చేసుకున్న పర్యాట కులు ఉదయం 12 గంటల వరకు మన్ననూర్‌ వనమాలిక వద్దకు చేరుకోవాలి. రెండు గంటల వరకు భోజన విరామం తర్వాత అక్కడే ఉన్న అటవీ బయోల్యాబ్‌, పర్యావరణ విజ్ఞాన కేంద్రాల సందర్శన చేయిస్తారు. సాయంత్రం గుండం మీదుగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో వ్యూపాయింట్‌కు తీసుకెళ్తారు. దారిపొడవునా కన్పించే వివిధ రకాల జంతువుల గురించి గైడ్‌లు పర్యాటకులకు అవగాహన కల్పిస్తారు. తిరిగి రాత్రికి మన్ననూర్‌ కాటేజీల వద్దకు చేరుకోనున్న పర్యాటకులకు మరు సటి రోజు మన్ననూర్‌లోని ప్రతాప రుద్రుని కోటకు ట్రెక్కింగ్‌ లేదా ఉమామహేశ్వర క్షేత్రంలో దైవ దర్శనం చేయి స్తారు.

Updated Date - May 30 , 2024 | 11:22 PM