Share News

స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహణ అభినందనీయం

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:29 PM

ప్రజలతో మమేకం అయ్యేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహణ అభినందనీయం
వాలీబాల్‌ ఫైనల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ముగిసిన క్రీడా పోటీలు

గద్వాల క్రైం, ఫిబ్రవరి 15 : ప్రజలతో మమేకం అయ్యేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. యువత క్రీడా పోటీల్లో మంచి స్ఫూర్తి కనబరిచారని, ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యువల్‌ గేమ్స్‌ మీట్‌-2024 గురువారం ముగిసింది. ఈ సందర్భంగా వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్‌లతో కలిసిప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజలు కలిస్తే ఏదైనా సాధ్యం అన్నారు. యువత తమ ప్రాంతంలో జరిగిన సంఘటనలపై ఎలాంటి సమాచారమున్నా పోలీస్‌ వారికి తెల్పాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వలంటీర్లుగా పని చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఎస్పీ రితిరాజ్‌ మాట్లాడుతూ అన్యువల్‌ గేమ్స్‌ మీట్‌-2024లో భాగంగా వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మల్దకల్‌, గద్వాల టౌన్‌ జట్లు అద్భుతమైన టీమ్‌ వర్క్‌ చేశాయన్నారు. వాలీబాల్‌ పోటీల్లో మొదటి బహుమతిని మల్దకల్‌, రెండవ బహుమతిని గద్వాల డీటీవో జట్లు కైవసం చేసుకున్నాయి. క్రికెట్‌ పోటీల్లో జిల్లా పోలీస్‌ కార్యాలయం జట్లు మొదటి స్థానం, 10వ బెటాలియన్‌ జట్లు రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. విజేత జట్లకు కలెక్టర్‌, ఎస్పీలు ప్రశంశాపత్రాలు, కప్‌లను బహూకరించారు. అనంతరం ఎర్రవల్లిలోని ఏకశిల, సరస్వతీ పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన సైబర్‌క్రైమ్స్‌ నాటకం, ఇతర సాంసృతిక, నృత్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, ఆర్టీవో పురుషోత్తంరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:29 PM