Share News

జిల్లాకు చేరిన పాఠ్య పుస్తకాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:59 PM

2024-25 విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభు త్వం సంకల్పించింది

జిల్లాకు చేరిన పాఠ్య పుస్తకాలు
నారాయణపేటలో పాఠ్య పుస్తకాలను పరిశీలిస్తున్న డీఈవో అబ్దుల్‌ ఘనీ

- జిల్లాకు 3.90 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం

- విడతల వారీగా 3.75 లక్షల పుస్తకాల రాక

నారాయణపేట, జూన్‌ 3 : 2024-25 విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభు త్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా ప్రస్తుత వేసవిలోనే పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 511 ప్రభు త్వ పాఠశాలు ఉండగా, ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 70,601 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం జూన్‌ 13 నుంచి పునర్‌ ప్రారంభం కానుండగా, జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్ధుల్‌ ఘనీ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాకు రెండు విడ తల్లో 3.75 లక్షల పాఠ్య పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. సోమవారం జిల్లాకు వచ్చిన పాఠ్య పుస్తకాలను డీఈవో పరిశీలించగా, పాఠ్య పుస్తకాల నిర్వాహణ ఇన్‌చార్జి అధికారి సాయినాథ్‌ పర్యవేక్షణలో నారాయణపేట సింగార్‌ బేస్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పాఠ్య పుస్తకాలను ఎమ్మార్సీలకు సరఫరా చేస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే జిల్లాలోని 13 మండలాలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అవసరం మేరకు సకాలంలో పంపిణీ చేసేందుకు అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, సకాలంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేలా చూడాలని ఆదేశించారు.

Updated Date - Jun 03 , 2024 | 10:59 PM