Share News

పీయూలో ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:02 PM

పాలమూరు యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వర్సిటీలో బుధవారం ధర్నాకు దిగారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలునిచ్చిన చలో పీయూ కార్యక్రమంలో భాగంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలొచ్చారు.

పీయూలో ఉద్రిక్తత
పీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల చలో వర్సిటీ

సమస్యలు పరిష్కరిస్తామని రాసివ్వాలని డిమాండ్‌

వీసీ ఘెరావ్‌.. చాంబర్‌ లోపల ఉంచి తాళం

పోలీసుల జోక్యంతో విరమణ

పాలమూరు యూనివర్సిటీ, ఫిబ్రవరి 7: పాలమూరు యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వర్సిటీలో బుధవారం ధర్నాకు దిగారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలునిచ్చిన చలో పీయూ కార్యక్రమంలో భాగంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. ముందుగా ప్రధాన గేటు నుంచి పీయూ పరిపాలన భవనం వరకు ర్యాలీ చేశారు. నేరుగా వీసీ చాంబర్‌లోకి వెళ్లే ప్రయాత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత పోలీసులను తోసుకుని వీసీ చాంబర్‌లోకి వెళ్లి, దాదాపు గంటపాటు చాంబర్‌లో బైఠాయించారు. వర్సిటీలో లా, ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని, సెమిస్టర్‌ ఫీజులు తగ్గించాలని, గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వీసీతో వాగ్వాదానికి దిగారు. దాంతో వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ బయటికి వచ్చి విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయినా విద్యార్థులు వినలేదు. సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని లఖిత పూర్వకంగా రాసివ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు వీసీ ఒప్పుకోలేదు. తన చాంబర్‌కు వెళ్లే ప్రయత్నం చేయగా, విద్యార్థులు ఘెరావ్‌ చేశారు. పోలీసులు విద్యార్థులను తప్పించే ప్రయత్నం చేశారు. విద్యార్థులు అక్కడే బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వీసీ తన చాంబర్‌లోకి వెళ్లగా, ఆయన బయటికి రాకుండా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సి బయట నుంచి తాళం వేశారు. సమస్యలు పరిష్కరిస్తామని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి తీవ్రత దాటుతుందని భావించిన వన్‌ టౌన్‌ సీఐ ప్రత్యేక పోలీసు బృందాలను, మహిళా పోలీసులను పిలిపించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వత రూరల్‌ సీఐ గాంధీనాయక్‌ విద్యార్థులతో చర్చలు జరిపారు. వీసీ చాంబర్‌కు తాళం వేయడం నేరమని సర్దిచేప్పి, తీయించారు. దాంతో ఆందోళన విరమించారు. టూ టౌన్‌ సీఐ స్వామి గౌడ్‌, వన్‌ టూన్‌ సీఐ భీమ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ శ్రీనువా్‌సలు, రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ బందోబస్తులో పాల్గొన్నారు.

అసత్య ప్రచారం మానుకోవాలి : వీసీ

ఏబీవీపీ విద్యార్థులు హాస్టల్స్‌లో సమస్యలు ఉన్నాయని, మౌలిక వసతులు లేవనే అసత్య ప్రచారాలు మానుకోవాలని పీయూ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ అన్నారు. విద్యార్థులు ధర్నా విరమించాక ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు విద్యార్థులు పబ్లిసిటీ కోసం లేని సమస్యలను సృష్టించి వర్సిటీని, అధికారులను బద్నాం చేస్తున్నారన్నారు. హాస్టల్‌ నిర్మాణంలో కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారని, ఆలస్యానికి నోటీసులు ఇచ్చామని, ఇంజనీరింగ్‌ విభాగానికి ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. ప్రభుత్వం చేసే పని కూడా తమను చేయాలనడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాటాలు సరైనవే అయినా, ఆధారాలు లేకుండా వారి సంస్థల పిలుపు మేరకు ఆందోళన చేసి తమను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో ఓఎ్‌సడీ డాక్టర్‌ మధుసూదన్‌, రెడ్డి, పీజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రకిరణ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:10 PM