Share News

పగలు ఎండ.. సాయంత్రం వాన

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:46 PM

కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఇళ్ల ఉంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కానీ, శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా నాగర్‌కర్నూలు జిల్లాలో వర్షాలు కురిశాయి. ఉప్పునుంతల మండలంలో ఓ మహిళ పిడుగుపాటుతో మృతి చెందింది.

పగలు ఎండ..  సాయంత్రం వాన
పిడుగు పాటుతో మృతి చెందిన మహిళ శవం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

భానుడి వేడికి కొంత ఊరట

పిడుగుపాటుతో మహిళ మృతి

మహబూబ్‌నగర్‌/నారాయణపేట/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/గద్వాల/అచ్చంపేట/వనపర్తి అర్బన్‌/ ఉప్పునుంతల, ఏప్రిల్‌ 12 : కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఇళ్ల ఉంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కానీ, శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా నాగర్‌కర్నూలు జిల్లాలో వర్షాలు కురిశాయి. ఉప్పునుంతల మండలంలో ఓ మహిళ పిడుగుపాటుతో మృతి చెందింది. అయినా కొన్ని జిల్లాలో 40 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత మాత్రం తగ్గడం లేదు. నాగర్‌కర్నూలు జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి తీవ్ర ఎండల నుంచి వాతావరణం చల్లబడింది. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన వర్షం దాదాపు గంటన్నర పాటు కురిసింది. నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీలో 5.8 మిల్లీ మీటర్ల వర్షం కురువగా మండల పరిధిలోని కుమ్మెరలో 3.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అకాల వర్షం కారణంగా పట్టణంలోని చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలం కొరటికల్‌, వెల్టూరు, తాండూరు గ్రామాలతో పాటు అచ్చంపేట మండలం పుల్జాల, హాజిపూర్‌ అచ్చంపేట పట్టణలో వర్షం కురిసింది. ఉప్పునుంతల మండలం పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందింది.

తాడూరులో పిడుగు పాటు..

ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన గుండమోని శ్యామల(34) పిడుగుపాటుతో మృతి చెందినట్లు ఆర్‌ఐ రాజేశ్వర్‌రెడ్డి గ్రామస్ధులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన పొలంలో పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఉరుములు మొరుపులతో కూడిన అకాల వర్షం వస్తుండటంతో పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్ళింది. చెట్టు మీద పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం తగ్గిన తరువాత చిన్న కుమారుడు పొలానికి వెళ్ళగా చెట్టు కింద తల్లి మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులతో పాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఆర్‌ఐ రాజేశ్వర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతురాలికి ముగ్గురు కుమారులతో పాటు భర్త పర్వతాలు ఉన్నారు.

తగ్గని ఉష్ణోగ్రతలు..

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో 40.9, ధరూర్‌లో 40.6, అలంపూర్‌, వడ్డేపల్లిలలో 40.1 డిగ్రీలు నమోదైంది. గద్వాల, రాజోలిలలో 40, మల్దకల్‌లో 39.9, కేటీదొడ్డిలో 39.7, ఇటిక్యాలలో 39.6, ఉండవెల్లిలో 39.1, మానవపాడులో 38.3, గట్టులో 38.5 డిగ్రీలు నమోదు అయ్యింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో 40.8 డిగ్రీలు, పాన్‌గల్‌, చిన్నంబావిలలో 40.3, శ్రీరంగాపూర్‌ 39.9, పెబ్బేరు 39.6, వనపర్తి 39.5, పెద్దమందడి 39.4, ఆత్మకూరు 39.3, గోపాల్‌పేట 39.2, ఖిల్లాఘణపూర్‌ 39.8, శ్రీరంగాపూర్‌, మదనాపూర్‌ 39.8, వీపనగండ్ల 38.5, రేవల్లి 37.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలంలో 41.1, పెద్దకొత్తపల్లిలో 39.7, నాగర్‌క్నూల్‌లో 39.6, అచ్చంపేటలో 39.4, కల్వకుర్తిలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో అత్యధికంగా 39.9 డిగ్రీలు, అడ్డాకులలో 39.8, సీసీకుంటలో 39.7, బాలానగర్‌లో 39.5, జడ్చర్లలో 37.8, భూత్పూర్‌లో 38 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 36 డిగ్రీలు, మక్తల్‌లో 37 డిగ్రీలు, నర్వలో 35 డిగ్రీలు, కృష్ణలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Apr 12 , 2024 | 10:46 PM