Share News

ఆదర్శ ప్రజా నాయకుడు సుందరయ్య

ABN , Publish Date - May 19 , 2024 | 10:41 PM

ధనిక కుటుంబంలో పుట్టినా సమ సమాజ నిర్మాణే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం సాగించిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ వంతమైన ప్రజా నాయకుడని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట స్వామి కీర్తించారు.

ఆదర్శ ప్రజా నాయకుడు సుందరయ్య
ధరూరులో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి

- సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి

- వర్ధంతి సందర్భంగా పుచ్చలపల్లికి ఘన నివాళి

గద్వాల టౌన్‌, మే 19 : ధనిక కుటుంబంలో పుట్టినా సమ సమాజ నిర్మాణే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం సాగించిన పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ వంతమైన ప్రజా నాయకుడని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట స్వామి కీర్తించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతలో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య 30వ వర్ధంతిని ఆదివారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దివంగత నాయకుడి చిత్రపటానికి వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. కులం, మతం పేరుతో పదవుల కోసం నేటి సమాజంలో రాజకీయ ముసుగులో నాయకులు చేస్తున్న విన్యాసాలు ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో సుందరయ్య వంటి ఆదర్శవంతుల జీవిత వృత్తాంతం తెలుసుకోవడం నేటితరం యువతకు అవసరమన్నారు. జాతీయ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వివిధ సంఘాలను ఏర్పాటు చేసిన సుందరయ్య తెలంగాణలో రజాకార్లు, జమీందార్లు, జాగీరుదార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన సుందరయ్య త్యాగనిరతి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం వామపక్షాలు మరింత నిబద్ధతతో పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, ఆంజనేయులు, నరేష్‌, పరశురాముడు, బాబు, నరసింహా ఉన్నారు.

- ధరూరు : మండల కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడారు. దేశంలో విప్లవ సాధనకు మార్గాన్ని, వ్యూహాన్ని నిర్ధేశించి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన పోరాటయోధుడన్నారు. నేటితరం కమ్యూనిస్టులు సుందరయ్య ఆశయ సాధన కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు నరసింహులు, గోవిందు, చిన్నగోవిందు, దేవదాసు, తిమ్మన్న, ఆంజనేయులు, మోష, దుబ్బన్న, రంగస్వామి, మునిసిపల్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు రాజేష్‌ ఉన్నారు.

- రాజోలి : మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి మాజీ ఉప సర్పంచులు గోపాల్‌, దస్తగిరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి విజయ్‌కుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు లక్ష్మన్న, ఆటో యూనియన్‌ నాయకులు జయన్న, భాష తదితరులు పాల్గొన్నారు.

- గట్టు : మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో సీపీఎం నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వీవీ.నర్సింహా హాజరై, మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సుందరయ్య పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లారని, నేటితరం రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సుందరయ్య ఆశయాల సాధన కోసం ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు ఏ.నర్మద, మండల కమిటీ సభ్యుడు ఆంజనేయులు, నాయకులు స్వామి, బాలరాముడు, గోవిందు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

- ఉండవల్లి : మండల కేంద్రంతో పాటు, ప్రాగటూరు గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సీపీఎం జిల్లా సభ్యుడు మద్దిలేటి, సీఐటీయూ మండల కన్వీనర్‌ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యుడు రాఘవేంద్ర, మోక్ష కృష్ణ, సంజన్న, రాంబాబు, హామాలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రాగటూరులో ప్రజానాట్య మండలి అధ్యక్షుడు అలీఅక్బర్‌, కార్యదర్శి ఆశన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే.ఈదన్న, మధు, చిన్నరాయుడు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 10:41 PM