Share News

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 30 , 2024 | 11:23 PM

ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం

గద్వాల న్యూటౌన్‌, మే 30 : ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరతను సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఫర్టిలైజర్‌ దుకాణంలో తప్పనిసరిగా స్టాక్‌ బోర్డుపై అమ్మకాల వివరాలను విధిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని డీలర్లను ఆదేశించారు. స్టాక్‌ బోర్డులో పేర్కొన్న వివరాలకు అను గుణంగా, వారి దుకాణంలో నిల్వ ఉందో, లేదో తనిఖీ చేయాలని సూచించారు. ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మొద్దని, నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని చెప్పారు. నిబంధలను పాటించని డీలర్లపై తక్షణ చర్యలు తీసుకుంటేనే మిగితా డీలర్లు రైతులకు విత్తనాలు, ఎరువులను సక్రమంగా విక్రయిస్తారన్నారు. జూన్‌ 15 వరకు ప్రతీ మండలంలో రోజుకు నాలుగు, ఐదు దుకాణాలు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విత్తనాలు, ఎరువుల కొరత ఉంటే, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అవ సరం మేరకు తెప్పించి, రైతులకు సకాలంలో అందిం చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్‌, అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయాలి

రైతులకు నష్టం జరుగకుండా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు. విత్తన ఉత్పత్తిదారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పంటల సాగుకు అనుకూలమైన వాతావారణం ఉన్నందున రైతులకు అవగాహన కల్పించి మేలురకం విత్తనాలు అందించాలని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచి, రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. అందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌నాయక్‌, వ్యవసాయ శాఖ సంచాలకులు వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఆదేశం మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు సూచించారు. ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా తమ కార్యాలయాల వద్దనే వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో ఉదయం 8.30 గంటల్లోగా పతాకావిష్కరణ నిర్వహించుకోవాలని సూచించారు. ఆ తర్వాత తొమ్మిది గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించనున్న పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గౌరవించుకోవడం ముఖ్యమని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్‌, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్‌ పాల్గొన్నారు.

యూనిఫాంలు సిద్ధం చేయాలి

గద్వాల : పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి యూనిఫాంలను సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ కుట్టు మిషన్‌ కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మండల పరిధిలోని అనంతపురం గ్రామంలోని కుట్టు మిష న్‌ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకు న్నారు. గతంలో ఏజెన్సీలు యూనిఫాంలు తయారు చేసేవని, ఇప్పుడు ప్రభుత్వం ఆ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించిందని తెలిపారు. దీనివల్ల మహిళలకు ఉపాధి లభిస్తోందని వివరించారు. కుట్టు శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని, కుట్టుమిషన్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల పిల్ల లకు కూడా దుస్తులను అందించాల్సి ఉంటుందని వివరించారు. 53,896 మంది విద్యార్థులకు అవస రమైన యూనిఫాంలు 52 కుట్టుమిషన్‌ కేంద్రాల్లో సిద్ధం అవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 40 శాతం మేర పని పూర్తయ్యిందని, మిగిలిన పనులను వచ్చేనెల ఐదవ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీఏ నర్సింగ్‌రావు, ఏపీడీ నర్సింహులు, ఏపీఎంలు పారిజాత, దేవన్న ఉన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:23 PM