శ్రీరామ జయ రామ
ABN , Publish Date - Jan 22 , 2024 | 11:27 PM
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారు.
- అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠోత్సవం
- జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యక్ష ప్రసారం
- ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు
- రామనామస్మరణతో మార్మోగిన పట్టణాలు, గ్రామాలు
- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు
గద్వాల టౌన్, జనవరి 22 : అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఆలయాల్లో ఎల్‌సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీతారాములకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణాలు, గ్రామాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊరూరూ శ్రీరామ నామ స్మరణతో మార్మోగాయి.
శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షం
శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో ప్రజలంతా సుభి క్షంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. గద్వాల పట్టణంలోని రాంనగర్ రామాల యంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కోట రామాలయం, వాసవీ కన్యకా పరమేశ్వరి, గుండు చెన్నకేశవస్వామి ఆలయాల్లో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గుండు చెన్నకేశవస్వామి ఆలయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు మునిసి పల్ మాజీ చైర్‌పర్సన్ బండల పద్మావతి, వెంకట్రాములు దంపతులు అభిషేకం చేశారు. కొత్త హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీగోసాయి వీరహనుమాన్ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. 1996లో జరిగిన కరసేవలో పాల్గొన్న వారిని గోసాయి వేణు, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ టపాల కృష్ణవేణి ఆధ్వ ర్యంలో సన్మానం నిర్వహించారు. పిల్లిగుండ్ల కాలనీ లోని ముడుపుల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ గద్వాల, వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఫణిమోహన్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
- గద్వాల పట్టణంలో రాఘవేంద్ర మఠం, కోట భూలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. వేదనగర్ పాండురంగ శివాలయం నుంచి ప్రారంభమైన శోభా యాత్ర, కోటలోని సీతారామాలయం వరకు కొనసాగింది.
ధరూరు : మండల కేంద్రంలో శోభాయాత్ర నిర్వహిం చారు. మండలంలోని రేవులపల్లి ఆలయంలో సంప్రదా య నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో సందెరాళ్లు, కబడ్డీ పోటీలు నిర్వహించారు.
మల్దకల్ : ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభువు శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్యశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల పంచలోహ విగ్రహాలకు పంచామృతాభిషేకం చేశారు. ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవ ప్రసారాన్ని తిలకించారు. శేషంపల్లిలో పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు రవి, బాబురావు, రామచంద్రారెడ్డి, భానుప్రకాష్, నాగరాజుశర్మ, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్, తిమ్మారెడ్డి, ప్రతాప్ పాల్గొన్నారు.
మానవపాడు : మానవపాడు మండల కేంద్రంలో భక్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అమర వాయిలోని శ్రీరామ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు.
వైభవంగా సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి : ఎర్రవెల్లి మండలంలోని బీచుపల్లి కోదండ రామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఆంజనేయస్వామి ఆల యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కోండేరు గ్రామంలోని ఆలయంలో పోతురాజ్ సోమనాద్రి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
అలంపూర్ చౌరస్తా : మానవపాడు చెన్నిపాడు గ్రామంలోని శివాలయంలో స్వామి వారికి అభిషేకం చేశారు. చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో రాములవారి జెండాను అవిష్కరించారు. సాయంత్రం రాముడి చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. ఇళ్ల ముందు పంచదీపాలు వెలిగించారు.
ఇటిక్యాల : ఇటిక్యాల మండలంలోని చాగాపురం, ఇటిక్యాల, ఉదండాపురం, సాతర్య, వావిలాల, మునగాల, పెద్దదిన్నె గ్రామాల్లో సీతారాములు, ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
రాజోలి : మండల కేంద్రంలో జైశ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా కోటలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్‌పై రాముడి చిత్రపటాన్ని ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఉప్పరి మల్దకల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగిరెడ్డి, గోపాల్, జై శ్రీరామ్ సేవా సమితి సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వడ్డేపల్లి : మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని రామాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహిం చారు. సరస్వతి పాఠశాలలో సీతారాములు, ఆంజనేయ స్వామి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
సమైక్యత కోరుకునే హిందూ ధర్మం
అయిజ : సనాతన హిందూ ధర్మం దేశ సమైక్యతను కోరుకుంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలిఆచారి అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని అయిజలో వేర్వేరుగా నిర్వహించిన శోభాయాత్రలో వారు పాల్గొన్నారు. పట్టణం లో మహిళలు ఇళ్ల ముందు రంగవల్లులు వేసి, ఐదు దీపాలు వెలిగించారు. తుపుతురాలలో శోభాయాత్ర నిర్వహించారు. కాషాయ జెండాలతో వాటర్ ట్యాంకుపైకి ఎక్కి జై శ్రీరాం నినాదాలు చేశారు.
ఆకట్టుకున్న జై శ్రీరామ్ లక్ష దీపోత్సవం
ధరూరు : ధరూరు మండల పరిధిలోని బూరెడ్డిపల్లి రామాలయం వద్ద ప్రజలు, భక్తులు లక్ష దీపాలు వెలిగించారు. ‘జై శ్రీరామ్’ అక్షరాకృతిలో వెలిగించిన దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచు బండ్ల జ్యోతి, బండ్ల రాజశేఖర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల వెంకటేశ్వర్ రెడ్డి, అనంద్ రెడ్డి పాల్గొన్నారు.