Share News

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:36 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో మొత్తం 65 ఐటీఐలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా మార్చలన్న లక్ష్యంతో భగీరథ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
ఐటీఐ సాంకేతిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు, చిత్రంలో ఎమ్మెల్యేలు జీఎంఆర్‌, శంకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ విజయేందిర బోయి

ఐటీఐ చదివే విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ

ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌లో సాంకేతిక భవన శంకుస్థాపనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో మొత్తం 65 ఐటీఐలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా మార్చలన్న లక్ష్యంతో భగీరథ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బాలికల ఐటీఐ కళాశాల ఆవరణలో సమీకృత బాలురు, బాలికల అధునాతన సాంకేతిక కేంద్ర భవన(రూ.9.48 కోట్లు) నిర్మాణానికి ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, శంకర్‌, కలెక్టర్‌ విజయేందిర బోయిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనతో పేద విద్యార్థులు చదువుతున్న ఐటీఐని ఇంటర్నేషనల్‌ స్థాయికి తేవడానికి ముందకు సాగుతున్నామన్నారు. దావో్‌సకు వెళ్లిన సమయంలో అక్కడ టాటా ప్రాజెక్ట్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రూ.2,300 కోట్ల పెట్టుబడులతో ఐటీఐ చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వాలని ఆచరణలోకి తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దనుండగా, మహబూబ్‌నగర్‌ జిల్లాకు మొదటి దఫాలోనే అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ మంజూరైందన్నారు. కళాశాలలో ఆరు కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అచ్చంపేటలోనూ ఏటీసీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 65 కేంద్రాల్లో నవంబరు లేదా డిసెంబరులో కోర్సులు ప్రారంభం అవుతాయని తెలిపారు. గతం ప్రభుత్వ హయాంలో ఐటీఐలు కనీస అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ పాలమూరును అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీహరి, మధుసుదన్‌రెడ్డి, శంకరయ్య, కలెక్టర్‌ విజయేందిర బోయి మాట్లాడారు.

స్థల పరిశీలన

జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల ఆవరణ టాస్క్‌ సెంటర్‌ కోసం స్థలాన్ని మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పరిశీలించారు. ఇక్కడ టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ ప్రారంభించిన మంత్రి

జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నవరత్నాల కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత తదిరతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:36 PM