Share News

చకచకా ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:16 PM

జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మెడికల్‌ కళాశాలల ఏర్పాటు పనుల్లో వేగం పెంచారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

చకచకా ఏర్పాట్లు
నారాయణపేట మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష (ఫైల్‌)

- గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మెడికల్‌ కళాశాలల ప్రారంభానికి చర్యలు

- జిల్లా ఆస్పత్రుల స్థాయి పెంపు

- ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యం

- త్వరలోనే వైద్య విద్య ప్రారంభం

గద్వాల న్యూటౌన్‌/ నారాయణపేట, ఫిబ్రవరి 29: జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మెడికల్‌ కళాశాలల ఏర్పాటు పనుల్లో వేగం పెంచారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా అధికారులు కూడా మెడికల్‌ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తుండటంతో మెడికల్‌ కళాశాల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో డైరక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) ఆధ్వరంలో త్వరలో ఏర్పాటు కానున్న మెడికల్‌ కళాశాలకు మొత్తం 433 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో ప్రిన్సిపల్‌-1, సూపరింటెండెంట్‌-1, డాక్టర్లు-130, పారామెడికల్‌ సిబ్బంది-36, స్టాఫ్‌ నర్సులు 203 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో ఇప్పటికే ఒక ప్రిన్సిపాల్‌తో పాటు స్టా్‌ఫ్‌నర్సులు 79 మంది విధుల్లో చేరినట్లు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పార్వతి తెలిపారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లి కాలనీ సమీపంలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ కళాశాలలోనే మెడికల్‌ కళాశాల తరగతులను కూడా త్వరలోనే ప్రారంభించేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అంతే కాకుండా జిల్లా ఆస్పత్రి జనరల్‌ ఆస్పత్రిగా అప్‌ గ్రేడ్‌ కావడంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నదని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా నారా యణపేట జిల్లాలో మెడికల్‌ కళాశాల తరగతులను ప్రారం భించేందుకు పను ల్లో వేగం పెంచారు. ప్రిన్సిపల్‌గా బాధ్యత లు స్వీకరించిన డాక్టర్‌ రాంకిషన్‌ పర్య వేక్షణ లో ఈ విద్యా సంవత్సరం కౌన్సెలిం గ్‌ ద్వారా వచ్చే 50 మంది విద్యార్థులకు సెప్టెంబరులో తరగతులు ప్రారంభించనున్నారు. ఇది వరకు ఉన్న జిల్లా ఆసుపత్రిని జనరల్‌ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. దీంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నది. తాత్కాలికంగా జిల్లా ఆసుపత్రి పాత భవనం పైఅంతస్తులోనే మెడికల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై అవగాహన కల్పించనున్నారు. తరగతులను మాత్రం అప్పక్‌పల్లి దగ్గర ఉన్న జిల్లా ఆసుపత్రి పైఅంతస్తులో నిర్వహించనున్నారు. ఇప్పటికే 105 మంది స్టా్‌ఫ్‌ నర్సులు విధుల్లో చేరారు. కలెక్టర్‌ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:16 PM