Share News

క్రీడా శిబిరాలతో నైపుణ్యాల మెరుగుదల

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:27 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలతో 14 సంవత్సరాలలోపు చిన్నారుల క్రీడా నైపుణ్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

క్రీడా శిబిరాలతో నైపుణ్యాల మెరుగుదల
ఆత్మకూరులో వాలీబాల్‌ క్రీడలో శిక్షణ పొందుతున్న చిన్నారులు

- క్రీడాంశాల సాధనకు ఆసక్తి చూపిన బాలికలు

- జిల్లా వ్యాప్తంగా 450 మంది విద్యార్థులకు శిక్షణ

- యువజన క్రీడల శాఖను అభినందిస్తున్న క్రీడాకారులు

ఖిల్లాఘణపురం, జూన్‌ 3 : గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలతో 14 సంవత్సరాలలోపు చిన్నారుల క్రీడా నైపుణ్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో చిన్నారులను సెల్‌ఫోన్‌, టీవీలకు దూరంగా ఉంచడానికి వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడిని జయించే సామార్థ్యం, శారీరక దారుఢ్యం, చిన్నారుల్లో ఏకాగ్రతను పెంపొందించడానికి ఈ శిబిరాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి క్రీడా సామగ్రిని సమకూరుస్తూ క్రీడాంశాలలో తర్పీదునిచ్చే కోచ్‌లను ఏర్పాటు చేసింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణ శిబిరాలు వేలాది మంది క్రీడాకారులను తయారు చేస్తున్నాయి. క్రీడాంశాలలో మెలకువలు నేర్చుకోవడానికి బాలబాలికలు ఆసక్తి కనబరుస్తున్నారు. వేసవికాలంలో చిన్నారులు సమయాన్ని వృథా చేయకుండా మే 1 నుంచి 30 రోజుల పాటు ప్రతీ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు క్రీడా మైదానాల్లో బాలబాలికలు వివిధ క్రీడల్లో శిక్షణ పొందారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల చిన్నారులు క్రీడలలో తర్పీదు పొందడానికి తెల్లవారేసరికి క్రీడా మైదానాలకు చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ జిల్లాకు 10 కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించారు.

జిల్లాలో 12 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిబిరాలు

వనపర్తి జిల్లా వ్యాప్తంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 12 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఎనిమిది క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌లను నియమించారు. క్రీడా శిబిరాల్లో హాకీ, వాలీబాల్‌, కబడ్డీ, ఫుట్‌ బాల్‌, క్రికెట్‌, యోగ, తైక్వాండో, అథ్లెటిక్స్‌ క్రీడల్లో సుమారు 450 మంది చిన్నారులు శిక్షణ పొందారు. క్రీడా శిక్షకుడు తమ ప్రాంతంలోని బాలబాలికల ఆసక్తి, అభిరుచి మేరకు ఏ క్రీడలో శిక్షణ ఇస్తారో ముందే నిర్ధారణ చేశారు. క్రీడా ప్రాంగణాల్లో పాఠశాల మైదానాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వం అందించే ఉచిత క్రీడా సామగ్రితో క్రీడాంశాలలో ప్రతిభ చాటుతున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:27 PM