Share News

పుట్టిన గడ్డకు వరాల జల్లు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:07 PM

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆదివారం పుట్టిన గడ్డ కల్వకుర్తికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నాలుగు గంటలకు హెలికాప్టర్‌ ద్వారా రావాల్సి ఉండగా, వర్షం కారణంగా 55 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. సీఎంకు అపూర్వ స్వాగతం లభించింది.

పుట్టిన గడ్డకు వరాల జల్లు
సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. చిత్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తికి తొలిసారి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి అపూర్వ స్వాగతం

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ మంజూరు

రూ.180 కోట్లతో తండాలకు రోడ్లు

తాను చదువుకున్న పాఠశాలకు రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు

జైపాల్‌రెడ్డి స్వగ్రామంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు

మాడ్గుల మండలంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన

కల్వకుర్తి ఆస్పత్రి వంద పడకలకు పెంపు

ఆమనగల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

నాగర్‌కర్నూల్‌/కల్వకుర్తి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆదివారం పుట్టిన గడ్డ కల్వకుర్తికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నాలుగు గంటలకు హెలికాప్టర్‌ ద్వారా రావాల్సి ఉండగా, వర్షం కారణంగా 55 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. సీఎంకు అపూర్వ స్వాగతం లభించింది. అప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. సభకు కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం ఉద్వేగంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో కల్వకుర్తి రాజకీయ చైతన్యం గురించి, ఈ ప్రాంతంతో తన అనుబంధం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పుట్టపాగ మహేంద్రనాథ్‌, సూదిని జైపాల్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి లాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమన్నారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ, వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతీ రాజకీయ నాయకుడిపై ఉందన్నారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా మీ బిడ్డను ఆదరించారని, భుజాన ఎక్కించుకుని తిప్పారని అన్నారు. మీ కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని కల్వకుర్తికి వరాలు ప్రకటించారు. 10 కోట్ల రూపాయలతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆమనగల్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అందుకు ఆగస్టు ఒకటిన అంకురార్పణ చేస్తామన్నారు. సూదిని జైపాల్‌రెడ్డి జన్మించిన మాడ్గుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఐదు హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.15 కోట్లు, కల్వకుర్తి పట్టణంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణానికి రూ. ఐదు కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.78 కోట్లు ఇస్తామన్నారు. రూ.163 కోట్ల వ్యయంతో రహదారులు, భవనాల శాఖ నిర్మాణాన్ని చేపడుతామన్నారు. హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి మీదుగా శ్రీశైలం వెళ్లే రహదారి నాలుగు లేన్లుగా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను చదువుకున్న తాండ్ర ప్రభుత్వ పాఠశాలకు తక్షణం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం.. తండాల నుంచి మండలానికి రోడ్ల నిర్మాణానికి రూ.180 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. కల్వకుర్తి ఆస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచుతున్నామని, ఆమనగల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.109 కోట్ల రూపాయల చెక్కును సీఎం అందించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కల్వకుర్తికి చెందిన కొందరు మహిళలు తమకు డబుల్‌బెడ్రూం ఇండ్లు కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుంది: దామోదర

జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు దొరలు, కుటుంబ పాలనను దించి, కాంగ్రెస్సే ప్రజస్వామ్యాన్ని కాపాడుతుందని అధికారం ఇచ్చారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలను అమలు పరిచి చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ యువతలో ఉన్న నైపుణ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డితో తన తండ్రికి మంచి సంబంధం ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ పోరాట సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని జైపాల్‌రెడ్డి ఒప్పించారని అన్నారు. జైపాల్‌రెడ్డి తత్వవేతగా, జాతీయ నాయకుడిగా ఎదిగిన మహానేత అని కొనియడారు.

ఈ ప్రాంత దశ మారనుంది: జూపల్లి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి కావడంతో ఈప్రాంత దశ దిశ మారనుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ) రూపకల్పణ కోసం కేంద్ర మాజీ మంతి సూదిని జైపాల్‌రెడ్డి పనిచేశారని గుర్తు చేశారు. కేఎల్‌ఐకి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కోరారు.

కల్వకుర్తి అభివృద్ధికి నిధులు ఇవ్వండి: కశిరెడ్డి

కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేంత్‌రెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారయణరెడ్డి కోరారు. కల్వకుర్తికి 100 పడకల ఆస్పత్రి, రోడ్ల అభివృద్ధికి రూ.700 కోట్లు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజ్‌, ఆమనగల్లుకు డిగీ కళాశాల భవనం మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. వెల్దండ మండలంలోని చెర్కూర్‌ సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తాండ్ర స్కూల్‌కు రూ.50 లక్షలు, రైతులకు పెండింగ్‌లో ఉన్న భూ నష్టపరిహారం రూ.16 కోట్లు మంజూరు చేయాలని, చారకొండ మండలంలోని గోకారం చెరువును పునఃనిర్మించాలని కోరారు.

నల్లమలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలి: వంశీకష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణకు ఊటి లాంటి ప్రాంతంగా ఉన్న నల్లమలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. నల్లమల అడవిలో ఔషధ మొక్కలు ఉన్నందున ఔషధ కళాశాల మంజూరు చేయాలన్నారు.

ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలి: మల్లు రవి

ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేయడంతో ఇతర రాష్ట్రల ముఖ్యమంత్రులు సీఎంను కొనియాడుతున్నారని అన్నారు.

జైపాల్‌రెడ్డి అడుగు జాడల్లో నడుద్దాం: వంశీచంద్‌రెడ్డి

కల్వకుర్తి పేరును ప్రపంచ వ్యాప్తంగా గుర్తు చేసిన సూదిని జైపాల్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే కోరిన వాటిని సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేముల నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, నాయకులు ఠాగూర్‌ బాలాజీసింగ్‌, బృంగి ఆనంద్‌కుమార్‌, కాయితి ఆశాదీ్‌పరెడ్డి, కాయితి శాయిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సూదిని రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ

కల్వకుర్తి పరిధిలోని కొట్ర గేటు వద్ద కేంద్ర మాజీ మంత్రి, దివంగత సూదిని జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, మాజీ మంత్రి చిత్తరంజన్‌దా్‌స, నాయకులు బాలాజీసింగ్‌, సూదిని పద్మారెడ్డి, కాయితీ సాయిరెడ్డి, కాయితీ ఆశాదీ్‌పరెడ్డి, బృంగి ఆనంద్‌కుమార్‌, షానవాజ్‌ఖాన్‌, జైపాల్‌రెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:07 PM