రోగులకు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Oct 08 , 2024 | 11:15 PM
ఆస్పత్రిలోని రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యులను ఆదేశించారు.
- వైద్యులకు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశం
- అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
అలంపూర్, అక్టోబరు 8 : ఆస్పత్రిలోని రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యులను ఆదేశించారు. అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులను పరిశీలించారు. రోగుల వివరాలను కంప్యూటరులో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు సమయానుసారంగా విధులకు హాజరు కావాలని, రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. ఫార్మసీలో అన్ని మందులను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ఎక్స్‌రే, ఈసీజీ, డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి, రిపోర్టులను సకాలంలో అందించాలని చెప్పారు. బ్లడ్ స్టోరేజీ యూనిట్‌ను పరిశీలించి, అవసరమైన మేర రక్తం నిల్వ ఉండేట్లు చూసుకోవాలన్నారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని టెలికాం అడ్వయిజరీ సభ్యుడు ఇస్మాయిల్ కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట మునిసిపల్ కమిషనర్ సరస్వతి, వైద్యులు లక్ష్మమ్మ, ఫణీంద్ర ఉన్నారు.