శంభో శంకర
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:18 PM
మహా శివరాత్రి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
మహా శివరాత్రి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మారుమోగింది. అలంపూర్‌లోని జోగుళాంబ, అచ్చంపేటలోని ఉమా మహేశ్వరం, కొల్లాపూర్‌లోని లలితాంబిక సోమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలంపూర్ వద్ద తుంగభద్ర నదిలో, సోమశిల వద్ద కృష్ణానదిలో, అచ్చంపేటలోని ఉమామహేశ్వరం పాపనాశని గుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. రాత్రంతా జాగారం చేసి, శివుడిని స్మరించుకున్నారు.
- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్
మహాకుంభాభిషేకం
మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా దక్షిణకాశి అలంపూర్ క్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన మహా కుంభాభిషేకం కార్యక్రమానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ ఆలయం పశ్చిమ ద్వారంలో ఉంటుంది. మహా కుంబాభిషేకం సందర్భంగా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలి రావడంతో దర్శనం కోసం గంటల తరబడి లైన్లలో వేచి చూశారు. జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, మంచినీరు, వైద్యం, అల్పాహారం వంటివి ఏర్పాటు చేశారు. భక్తులు దర్శించుకునేందుకు తుంగభద్ర నది పుష్కరఘాట్ వద్ద మహాశివుడి విగ్రహ నమూనాను ఏర్పాటు చేశారు. అక్కడ భక్తులు సెల్ఫీలు దిగారు. అలంపూర్ క్షేత్రంలో మహా కుంబాభిషేకాన్ని ఆలయ చాలా రోజుల తర్వాత నిర్వహించారు. 2009 తుంగభద్ర నది వరదల్లో నీటి ముంపునకు గురైనప్పుడు ఆలయ పునఃప్రారంభంలో భాగంగా మహాకుంభాభిషేకాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఇప్పుడు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
లింగాల గట్టులో పుణ్యస్నానాలు
మహాశివరాత్రి సందర్భంగా ఎడమ పాతాళగంగలో భక్తులు శుక్రవారం తెల్లవారు జామునుంచే పుణ్య స్నానాలు చేశారు. పుష్కర ఘాట్ వద్ద స్నానాలు చేసి, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించకునేందుకు శ్రీశైలం వెళ్లారు. ఇక్కడ మరుగుదొడ్లు, మూత్ర శాలలు, దుస్తులు మార్చుకునేందుకు గదులు లేకపోవడంతో మహిళా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఎడమ పాతాళగంగలో నిత్యం వేలాది మంది భక్తులు స్నానాలు చేస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉన్న రోజుల్లోనైనా అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.