పోలీసు ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు
ABN , Publish Date - Jul 15 , 2024 | 10:54 PM
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని డీఎస్పీ లింగయ్య సిబ్బందికి సూచించారు.
నారాయణపేట, జూలై 15 : ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని డీఎస్పీ లింగయ్య సిబ్బందికి సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ సమస్యలపై బాధితుల నుంచి ఏడు ఫిర్యాదులు రాగా, డీఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిశీలించి, పరిష్కరించాలని సీఐ, ఎస్‌ఐలకు ఫోన్‌లో సూచించారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు నిరంతరంగా కృషి చేసి, ప్రజల మన్ననలు పొందాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 1930కి సమాచారం ఇవ్వాలన్నారు.
ముసురు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ లింగయ్య సూచించారు. మట్టి మిద్దెలు, గుడిసెల్లో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పోలీసులు సేవలు అందించేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు సరదా కోసం వాగులు, కుంటలు, నది పరివాహక ప్రాంతాల్లో సెల్ఫీలు దిగరాదని సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలన్నారు.