Share News

రాజీ మార్గంలో కేసుల పరిష్కారం

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:26 PM

కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరగకుండా రాజీ మార్గంలో సివిల్‌ కేసులను పరిష్కరించుకోవడం లోక్‌ అదాలత్‌తోనే సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ కె.కుష అన్నారు.

రాజీ మార్గంలో కేసుల పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ కె. కుష, చిత్రంలో కార్యదర్శి గంట కవితాదేవి

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ కె.కుష

గద్వాల క్రైం, జూన్‌ 5 : కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరగకుండా రాజీ మార్గంలో సివిల్‌ కేసులను పరిష్కరించుకోవడం లోక్‌ అదాలత్‌తోనే సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ కె.కుష అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల ఎనిమిదిన గద్వాల, అలంపూర్‌ న్యాయస్ధానాల్లో రెండవ జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. భార్యాభర్తల మధ్య తగాదాలు, భూ సమస్యలు, గృహహింస, డ్రంకెన్‌ డ్రైవ్‌, చెక్‌ బౌన్స్‌, ఇన్సూరెన్స్‌ తదితర రాజీ పడదగ్గ కేసులు అన్నింటిని లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఇలాంటి 1,504 కేసులను గుర్తించి హైకోర్ట్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రెండు వేలకు పైగా కేసులు వచ్చినా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గత లోక్‌ అదాలత్‌లో జిల్లాలో 3,060 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారుల సమయం, కోర్టు ఫీజులను ఆదా చేసుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 11:26 PM