Share News

మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:36 PM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల మతతత్వ విధానాలు దేశానికి, ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారనున్నా యని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు.

మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం
సమావేశంలో మాట్లాడుతున్న ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం

- ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 1 : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల మతతత్వ విధానాలు దేశానికి, ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారనున్నాయని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. పట్టణంలోని టీఎన్జీవో భవనంలో గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో రైతాంగం, కార్మికులు, మధ్య తరగతి ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా, ధరల పెరుగుదలతో ఆయా వర్గాల జీవన ప్రమాణాలు దుర్భరంగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక, రైతు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. దేశంలో నిరుద్యోగం గడచిన 50 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరిందన్నారు. శ్రామికుల నిజ వేతనాలు 20 శాతం తగ్గిపోగా, పని భారం పెంచడం ద్వారా కేంద్రం శ్రమదోపిడీకి అవకాశం కల్పించడం సిగ్గు చేటన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రైవేటు, కార్పొరేట్‌ శక్తులు లాభాలు గడిస్తుండగా, కార్మికులు, కర్షకులు, పేదల బతుకులు దుర్భరమయ్యాయన్నారు. ఏఐటీ యూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాల ప్రజలు నిరాశలో ఉండగా, బీజేపీ అనుకూల శక్తులు మాత్రం ఆర్థికంగా బలోపేతం అయ్యాయన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు హనుమంతు, కార్తీక్‌, కృష్ణ, నాగేష్‌, ఉప్పేరు నరసింహ, హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:36 PM