Share News

సంత్‌ సేవాలాల్‌ మార్గం అనుసరణీయం

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:31 PM

బంజారా జాతి చైతన్యానికి, పురోభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఆధ్యాత్మికవేత్త సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గం అనుసరణీయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

సంత్‌ సేవాలాల్‌ మార్గం అనుసరణీయం
జయంతి సభలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి కృషి

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 15 : బంజారా జాతి చైతన్యానికి, పురోభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఆధ్యాత్మికవేత్త సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గం అనుసరణీయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. గిరిజనుల సర్వతోముఖా భివృద్ధికి తన జీవితాన్ని అంకింత చేసిన మహానుభావుడన్నారు. పట్టణంలోని పీజేపీ క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోనే పురోగతి సాధ్యమని, ఆ దిశగా తండావాసులు తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. మూఢ నమ్మకాలను వినాడాలని, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలో గిరిజన కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గద్వాల ఆర్డీవో చంద్రకళ, గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

నాణ్యమైన భోజనం అందించాలి

గట్టు : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత సిబ్బందికి సూచించారు. మండలంలోని తప్పెట్లమోర్సు ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ అమలు చేయాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పదవతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుమ్మ నర్సింహులు, రంగస్వామిగౌడ్‌, దిలీప్‌, బజారి, గోవర్ధన్‌గౌడ్‌, నాగేంద్రం, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:31 PM