Share News

పురపాలికల్లో పారిశుధ్య కార్యక్రమాలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:36 PM

జిల్లాలోని పుర పాలికల్లో ఈనెల 20 నుంచి పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

పురపాలికల్లో పారిశుధ్య కార్యక్రమాలు
పుర కమిషనర్లు, మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- పుర కమిషనర్ల సమావేశంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, జనవరి 17 : జిల్లాలోని పుర పాలికల్లో ఈనెల 20 నుంచి పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో పుర కమిషనర్లతో పారిశుధ్య కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో 20 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగించి శుభ్ర పరచడం, డ్రైనేజీల్లోని పూడికను తొలగించడం, దేవాలయ ప్రాంగణాలను శుభ్ర పరచడం తదితర కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కోస్గిలో డస్ట్‌ బీన్‌లు ఏర్పాటు చేయాలని, మిషన్‌ భగీరథ నీరు ఇళ్లకు వస్తున్నాయా? లేదా? తెలుసుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, మక్తల్‌లో పందుల సంచారం ఎక్కువగా ఉందని వాటిని తొలగించుకునేలా సదరు యజమానులకు నోటీసులు ఇవ్వాలన్నారు. అవసరమైతే పోలీసుల సహాకారం తీసుకోవాలని సూచించారు. వార్డుల్లో నీటి సమస్య లేకుండా చూడాలని, శానిటేషన్‌తో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించేలా చూడాలని, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, కమిషనర్లు పాల్గొన్నారు.

నీటి ఎద్దడి లేకుండా చూడాలి..

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అనిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించి, మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్‌భగీరథ నీరు అందుతుందా? లేదా? అడిగి తెలుసుకోవాలన్నారు. ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఏఈలను ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల్లో పర్యటించి నీటి ఎద్దడిని తీర్చాలని, చేతి పంపులు, కుళాయిలు వివరాలు, టెస్టింగ్‌ నివేదికలను పంపాలని ఆదేశించారు.

Updated Date - Jan 17 , 2024 | 10:36 PM