Share News

ఇసుక మాఫియా

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:26 PM

దుందుభీ నది పరివాహక ప్రాంతంలో కంటికి రెప్పలా కాపాడుకున్న ఇసుక మేటలను కళ్ల ఎదుటే కొల్లగొడుతుంటే నిలువరించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లడం పరివాహక ప్రాంత ప్రజలను కలవరపెడుతున్నది.

ఇసుక మాఫియా
డంప్‌ చేసిన ఇసుకను హిటాచీ ద్వారా టిప్పర్‌లోకి నింపుతున్న వ్యాపారులు

- అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా

- ఒక టిప్పర్‌కు అనుమతితో పదుల సంఖ్యలో తరలింపు

- దుందుభీ నుంచి రోజుకు 30 నుంచి 50 టిప్పర్లలో తరలుతున్న ఇసుక

- ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నా పట్టించుకోని అధికారులు

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : దుందుభీ నది పరివాహక ప్రాంతంలో కంటికి రెప్పలా కాపాడుకున్న ఇసుక మేటలను కళ్ల ఎదుటే కొల్లగొడుతుంటే నిలువరించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లడం పరివాహక ప్రాంత ప్రజలను కలవరపెడుతున్నది. అనుమతుల పేరిట ఇసుక దోపిడీ కొనసాగుతుండడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు పదుల సంఖ్యలో భారీ టిప్పర్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నా రెవెన్యూ, మైనిం గ్‌ శాఖ అధికారులు మౌనం దాల్చడం వెనక అంతర్యమేమిటో బోధపడడం లేదు. తాడూరు మండలం మేడిపూర్‌, పొల్మూరు, గుట్టలపల్లి ప్రాంతాల్లో రోజుకు టిప్పర్లల్లో ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న దుందుభీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలివెళ్తున్నా ఎవరూ పట్టించుకునే పాపాన పోవడం లేదంటూ పొల్మూరు, మేడిపూర్‌ గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మైనింగ్‌ ఆదాయానికి గండి

ఇసుక అక్రమ రవాణాతో మైనింగ్‌ శాఖ లక్షల రూపాయలు నష్టపోతున్నా అధికారులు నోరు మెదపకపోవడం వెనుక అంతర్యమేమిటో బోధపడడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్యాండ్‌ టాక్సీ వాహనాలు నడపవల్సి ఉంటుంది. ఇసుక ఎవరికి అవసరం ఉంటే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్‌ ద్వారా అనుమతి పొందాలి. అనుమతి పొందిన పత్రంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న అధికారికి అనుమతి పత్రం చూపించి ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం పొల్మూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ వద్ద భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారు ఇసుకను అక్రమంగా కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దుందుభీ నదిలోకి ప్రత్యేకంగా రోడ్లు వేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దుందుభీ నదిలో నుంచి బయటకు ప్రతీరోజు భారీ టిప్పర్లలో దాదాపు 500 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా రవాణా అవుతుంది. జిల్లాలోనే కాక జిల్లా సరిహద్దులను కూడా దాటిస్తున్నట్లు సమాచారం. దుందుభీ పరివాహక ప్రాంతంలో కల్వకుర్తి మండలం గుండూరు, లింగసానిపల్లితో పాటుగా తాడూరు మండలంలోని మేడిపూర్‌, పొల్మూరు గ్రామాల్లో ఇసుక డంప్‌లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఉప్పునుంతల మండలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

జాతీయ రహదారి పేరిట కొనసాగుతున్న అక్రమాలు

మేడిపూర్‌ గ్రామం వద్ద కల్వకుర్తి నంద్యాల జాతీయరహదారికి సంబంధించి దుందుభీ నది వద్ద నూతన బ్రిడ్జిల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఈ పనులకు ఇసుక అవసరం ఉన్న సందర్భంలో ప్రభుత్వం వాడుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇదే ఇసుక దోపిడీ దారులకు వరంగా మారింది. దీనిని సాకుగా చూపి రాత్రి పగలు తేడా లేకుండా తోడేళ్లలా ఇసుకను తోడేస్తున్నారు. కొన్నిసార్లు గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నప్పటికీ అధికారులు స్పందించకపో వడం పలు విమర్శలకు దారి తీస్తోంది. అదేవిధంగా దుందుభీ నది పరివాహక ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా వాహనాలు చక్కర్లు కొడుతుండడంతో మేడిపూర్‌, పొల్మూరు, గుట్టలపల్లి ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. భారీ టిప్పర్లను మైనర్లు నడుపుతున్నప్పటికీ రోడ్డు రవాణా శాఖకు చెందిన అధికారులు మౌనంగా ఉండటం విశేషం.

Updated Date - Jun 06 , 2024 | 11:26 PM