Share News

రేవంత్‌ నజర్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:21 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే.. రాష్ట్రం నుంచి మెజారిటీ సీట్లు సాధించడం ద్వారా ప్రభుత్వ సుస్థిరతతోపాటు తన మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శిం చాలని భావిస్తున్న రేవంత్‌.. సొంత జిల్లాలో అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

రేవంత్‌ నజర్‌
ప్రజలకు అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి(ఫైల్‌)

- పాలమూరు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేక శ్రద్ధ

- ఇప్పటికే మూడు సభలు, రెండు సమావేశాలకు హాజరు

- నేడు వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్‌ రెడ్డి

- సొంత ఎన్నికగా తీసుకుని మరీ గెలుపు కోసం వ్యూహాలు

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే.. రాష్ట్రం నుంచి మెజారిటీ సీట్లు సాధించడం ద్వారా ప్రభుత్వ సుస్థిరతతోపాటు తన మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శిం చాలని భావిస్తున్న రేవంత్‌.. సొంత జిల్లాలో అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుని.. ప్రత్యర్థులు ఎక్కడ బలంగా ఉన్నారో తెలుసుకుని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లను గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోగా.. గెలుపుపై అధినేత ధీమాతో ఉన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా వంశీచంద్‌రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేయగా.. అప్పట్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేదు. కానీ ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఎలాగైనా ఇక్కడి నుంచి విజయకేతనం ఎగురవేయాలని హస్తం నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని స్థానాల కంటే ముందుగానే మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి చల్లా వంశీచంద్‌రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అభ్యర్థిగా ప్రకటనకు ముందే వంశీచంద్‌రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో పార్లమెంట్‌ నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. దీంతోపాటు మీ మాట- మా మేనిఫెస్టో లాంటి పలు వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నా రు. ప్రతీరోజూ రేవంత్‌రెడ్డి సలహాలు, సూచనలతో ఎన్నికల వ్యూహాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల ఓటమి సింపతిగా మారడంతోపాటు.. అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. దీంతోపాటు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ద్వారా కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పార్టీలో చేరి.. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు నేతృత్వం వహిస్తుం డగా.. మక్తల్‌ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన జలంధర్‌రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికలు కలిసి వస్తాయని నేతలు భావిస్తున్నారు.

ఆరోసారి జిల్లాకు రేవంత్‌...

సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఆరోసారి జిల్లా పర్యటనకు రానున్నారు. డిసెంబరు ఏడు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఫిబ్రవరి 22న తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రేవంత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంలోనే మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. తన నియోజకవర్గంలో తన కంటే అత్యధికంగా మెజారి టీ ఇవ్వాలని, కొడంగల్‌లో 50వేల మెజారిటీ కాంగ్రెస్‌ అభ్యర్థికి రావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మార్చి ఆరున మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభకు సీఎం హాజరయ్యారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా కొడంగల్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి.. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. మరోసారి కొడంగల్‌లోనే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. దానికి సీఎం హాజరై.. కార్యకర్తల కు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్‌ 15న నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన జాతర సభకు హాజరయ్యారు. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. మహబూబ్‌ నగర్‌ ఎంపీ అభ్యర్థి తరపున నామినేషన్‌ వేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో నే ఆరుసార్లు సీఎం ఈ పార్ల మెంట్‌ పరిధిలో పర్యటించడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తోంది.

నేడు నామినేషన్‌కు హాజరు

మహబూబ్‌నగర్‌ అభ్యర్థి నామినేషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శుక్ర వారం హాజరుకానున్నారు. తన రాక ద్వారా కార్యకర్తల్లో జోష్‌ పెంచడంతోపాటు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా జడ్చర్లకు చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ పట్టణంలోని మెట్టు గడ్డ వరకు తన కాన్వాయ్‌లో వస్తారు. అక్కడి నుంచి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని తీసుకుని. ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరతారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేసిన తర్వాత.. అక్కడి నుంచి ర్యాలీగా క్లాక్‌టవర్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ ప్రసంగించి.. తిరుగు ప్రయాణం అవుతారు. ఇదే కాకుండా ఎన్నికల్లోపు మరో సభ కూడా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 18 , 2024 | 11:21 PM