Share News

రేవంత్‌ పాలన అధ్వానం

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:34 PM

కేసీఆర్‌ పాలనకంటే రేవంత్‌ పాలన అధ్వానంగా ఉన్నదని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు.

రేవంత్‌ పాలన అధ్వానం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

- పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారు?

- కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి, రాష్ట్రానికి అప్పులు మిగిలాయి

- బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

గద్వాల, ఫిబ్రవరి 26 : కేసీఆర్‌ పాలనకంటే రేవంత్‌ పాలన అధ్వానంగా ఉన్నదని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల ఆస్తులు పెంచుకొని, తెలంగాణకు అప్పు మిగిల్చారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్‌, తన పాలనలో పథకాలకు రూ. 1.53 లక్షల నిధులు ఎలా తెస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలతో పాటు అభివృద్ధికి సంబంధించి ఐదేళ్లకు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కేసీఆర్‌ కంటే రేవంత్‌ రెండు ఆకులు ఎక్కువ చదివారని అనిపిస్తోందని, తెలంగాణకు ఆయన పెద్దగా ఇరగదీసేది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నుంచి ఇత్తడి తెలంగాణ చేశారని, రేవంత్‌ ఇత్తడి తీసుకపోయి మట్టి తెలంగాణ చేస్తాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 17 సీట్లను గెలుస్తామని, ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించినబీజేపీ, ఈ సారి ఓల్డ్‌ సిటీలో అసదుద్దీన్‌ను కూడా ఓడిస్తుందని జోష్యం చెప్పారు. నాగర్‌కర్నూల్‌, మహ బూబ్‌నగర్‌లలోనూ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రేవంత్‌రెడ్డి ఆస్థాన విధ్యాంసుడైన కనుగోలు అనే వ్యక్తి సర్వే చేస్తే 59 శాతం మంది మోదీకి ఓటు వేస్తామని చెప్పారని, దీంతో కంగారు పడిన కాంగ్రెస్‌ వారు ఆరు గ్యారెంటీల పేరుతో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం పగిలిపోయిందని ఎన్ని సార్లు చూపిస్తారని, అవినీతికి పాల్పడిన వారిపై చర్య లు తీసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి వికసిత్‌ భారత్‌తో వెలిగిపోతున్నదని అన్నారు. రాబోయే కాలంలో ఇతర దేశాల పిల్లలు మన దేశంలో ఉద్యోగాలు చేయడానికి రావాల్సిన సమయం వస్తుందని అన్నారు. సింగరేణి కార్మికుల జీతాలపై ఆదాయ పన్ను మినహాయింపు కోసం మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని, వారు ఎక్కువ సమయం గనుల్లో గడుపుతార ని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. సమావేశంలోబీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్‌ పాషా, అసెంబ్లీ కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు బల్గెర శివారెడ్డి, రజక జయశ్రీ, నర్సింమ, లత్తిపురం రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

జములమ్మ సన్నిధిలో ప్రముఖులు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సోమవారం జములమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరశురాముడిని దర్శించుకొని పూజలు చేశారు. ఆమె వెంట నాయకులు బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, రజక జయశ్రీ తదితరులు ఉన్నారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గద్వాలకు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, యాత్ర ఇన్‌చార్జి శ్రీవర్ధన్‌రెడ్డి జములమ్మ అమ్మవారిని, పరశురాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Feb 26 , 2024 | 11:34 PM