Share News

వెయ్యి మందికి రెడ్‌ నోటీసులు

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:12 PM

రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపాలిటీ అయిన పాలమూరు పురపాలిక.. పన్నుల వసూలులో మాత్రం కింది నుంచి ముందు వరుసలో ఉంది. నిధుల సంకటంతో కొట్టుమిట్టాడుతున్న మునిసిపాలిటీలో అధికారం మారడంతో పాలకుల దృష్టి ఇప్పుడు మొండి బకాయిల వసూళ్లపై పడింది.

వెయ్యి మందికి రెడ్‌ నోటీసులు
మహబూబ్‌నగర్‌ పట్టణం

పాలమూరు పురపాలికలో రూ.35 కోట్ల ఆస్తి పన్ను పెండింగ్‌

మొండి బకాయిదారులపై సీరియస్‌

రాష్ట్రంలోని 142 పురపాలికల్లో పన్ను వసూలులో మహబూబ్‌నగర్‌ 134వ స్థానం

రెడ్‌ నోటీసుకు స్పందించకుంటే ఆస్తుల జప్తు..

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 26: రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపాలిటీ అయిన పాలమూరు పురపాలిక.. పన్నుల వసూలులో మాత్రం కింది నుంచి ముందు వరుసలో ఉంది. నిధుల సంకటంతో కొట్టుమిట్టాడుతున్న మునిసిపాలిటీలో అధికారం మారడంతో పాలకుల దృష్టి ఇప్పుడు మొండి బకాయిల వసూళ్లపై పడింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, గతంలో కంటె పాలన మెరుగుపడిందన్న అభిప్రాయం కలగాలన్నా వారికి మెరుగైన వసతులు కల్పించాల్సి ఉంది. వసతులు కల్పించాలంటే ఉన్న ఆదాయ వనరులను పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారుల జాబితా తయారు చేసిన అధికారులు బకాయిల లిస్ట్‌లు చూసి విస్తుపోయారు. ఏకంగా వెయ్యి మంది మొండి బకాయిదారులను గుర్తించిన అధికారులు వారికి రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న వాళ్లు మూడు నుంచి వారం రోజుల్లో బకాయిలు చెల్లించాలి. లేదంటే వారి ఆస్తులను సీజ్‌ లేదా జప్తు చేస్తారు. ఒక్కో యజమాని ఆస్తి పన్ను రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. గతంలో పదేళ్ల పాటు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండటం, పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వారిలో మెజారిటీ సభ్యులకు అప్పటి అధికార పార్టీ అండదండలు ఉండటంతో బకాయిదారుల వద్దకు వెళ్లినప్పుడల్లా అధికారులకు ఫోన్‌లు వచ్చేవి. దాంతో బకాయి మొత్తం కాకుండా ఎంతోకొంత ముట్టుజెపుతూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడు అధికారం మారడం, తాజాగా పురపాలిక చైర్మన్‌ కూడా మారడంతో బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు కూడా కొందరు అధికారంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి బకాయిల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని పైరవీలు చేస్తుండటం విశేషం.

రాష్ట్రంలోనే పూర్‌

పాలమూరు పురపాలిక పన్ను వసూలులో రాష్ట్రంలోనే కింది నుంచి ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో 129 మునిసిపాలిటీలు.. 13 కార్పొరేషన్‌లు ఉండగా, పాలమూరు పురపాలిక ఆస్తి పన్ను వసులులో 134వ స్థానంలో ఉండటం గమనార్హం. పురపాలికలో రూ.35.53 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉంది. పురపాలికలో 49,908 అసె్‌సమెంట్‌లు ఉండగా వీటి ద్వారా ఏటా రూ.18.72 కోట్ల పన్నులు రావాలి. రూ.13.21 కోట్లు పాత బకాయిలు ఉండగా, ప్రస్తుతం, పాత బకాయిలపై రూ.17 కోట్ల వరకు ఫెనాల్టీ ఉంది. ఇలా మొత్తం రూ.48.88 కోట్లకు గాను రూ.13.34 కోట్లు వసూలయ్యాయి. రూ.35.53 కోట్లు రావాల్సి ఉంది. వీటి వసూలు కోసం యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మార్చి 31 నాటికి వంద శాతం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ వీటిపై సీరియ్‌సగా ఉన్నారు. రోజూ అధికారులతో మాట్లాడుతూ, వసూళ్లపై సమీక్ష చేస్తున్నారు. ఆర్‌వో, ఆర్‌ఐలకు రోజూ ఇంత వసూలు చేయాలని టార్గెట్‌లు విధించడంతో వారు మొండి బకాయిదారుల ఇళ్ల ముందు తిష్టవేస్తున్నారు. బకాయిల వసూలులో పనితీరు సరిగా లేనివారి జీతాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు.

పైరవీలు షురూ

ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని అడగడంతో అంతం మొత్తం చెల్లించలేక నాయకుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తున్నారు. మరికొందరు కొన్నాళ్లు ఇలానే హడావిడి చేసి వదిలేస్తారన్న ధీమాలో ఉన్నా రు. అయితే బకాయిల వసూలుకు సమయం ఇస్తూ విడతలుగా వసూలు చేస్తే చాలావరకు వసూలు అయ్యే అవకాశం ఉంది.

అద్దె వసూళ్లదీ అదే తంతు

ఆస్తి పన్ను వసూలు ఇలా ఉంటే.. మునిసిపాలిటీ దుకాణాల కిరాయిలదీ అదే పరిస్థితి ఉంది. పురపాలికలో 256 అద్దె దుకాణాలున్నాయి. వీటి ద్వారా రూ.23 కోట్ల వరకు అద్దె రావాల్సి ఉంది. ఇందులో కూడా రాజకీయజోక్యం కారణంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడుతూ వస్తున్నాయి. ఒక్కో దుకాణంపై రూ.అర కోటి నుంచి రూ.కోటి వరకు బకాయి ఉంది. ఈ రూ.23 కోట్లలో రూ.ఏడు కోట్ల వరకు బకాయి ఉన్న దుకాణాలకు చాలా రోజుల నుంచి తాళాలు వేసి ఉంటున్నాయి. కొన్ని కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌ చూపుతున్నా, మిగతా రూ.16 కోట్లు బకాయిలు దుకాణాలు నిర్వహిస్తున్నా అద్దె చెల్లించడం లేదని స్పష్టమవుతోంది. ఇక నీటి కొళాయిల బిల్లులు కూడా రూ.మూడు నుంచి రూ. నాలుగు కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా ఆస్తి పన్ను, దుకాణాల అద్దెలు, కొళాయిల బిల్లుల రూపంలోనే రూ.55 కోట్ల వరకు మునిసిపాలిటీకి రావాల్సి ఉంది. ఇవన్నీ వసూలు అయితే ఏడాది పాటు ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే అవకాశం ఉంటుంది.

వసూలు చేస్తాం

మొండి బకాయిదారులందరికీ రెడ్‌ నోటీసులు జారీ చేశాం. ఇచ్చిన గడువు ప్రకారం చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తాం. చాలామంది మంచి పొజిషన్‌లో ఉన్నా పన్నులు చెల్లించడం లేదు. అలాంటి వారంతా పన్నులు చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.

- ఆర్‌వో ఖాజా

Updated Date - Feb 26 , 2024 | 11:12 PM