Share News

తుది దశకు ఆర్డీఎస్‌ కాలువ పనులు

ABN , Publish Date - Jul 14 , 2024 | 10:17 PM

ఆర్డీఎస్‌ కాలువ అభివృద్ధి పనులు పూర్తి దశకు చేరుకున్నాయి.

తుది దశకు ఆర్డీఎస్‌ కాలువ పనులు
బైనపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఆర్డీఎస్‌ కాలువ అభివృద్ధి పనులు

- ముళ్ల పొదలు, పూడిక తొలగింపు

- మరో రెండు రోజుల్లో పనులు పూర్తి

అయిజ, జూలై 14 : ఆర్డీఎస్‌ కాలువ అభివృద్ధి పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. కాలువలో పేరుకుపోయిన పూడిక, ముళ్లపొదల కారణంగా నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుందని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 45 జీవో ప్రకారం కాలువ అభివృద్ధి పనులకు రూ.30 లక్షలు కేటాయించారు. ఈ పనులకు గత సంవత్సరం టెండర్లు పూర్తి చేశారు. అదే సమయంలో రెండు కిలోమీటర్ల వరకు పనులు చేసి కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే వదిలివెళ్లారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆర్డీఎస్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువలో పేరుకుపోయిన పూడిక తొలగించడం, కాలువ లోపల, కట్టపై ఉన్న ముళ్లపొదలను తొలగించారు. కర్ణాటక సరిహద్దు తెలంగాణాలోని 42.06 కిలోమీటర్‌ సిందనూర్‌ గ్రామం నుంచి 65.50 కిలోమీటర్‌ ఉప్పల క్యాంపు వరకు దాదాపు 23 కిలోమీటర్ల వరకు చేపట్టాల్సిన పనులు పూర్తయ్యాయి. ఇక అయిజ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో కాలువలో ఉన్న మట్టి కుప్పలను తొలగిస్తే పనులు పూర్తవుతాయి. ఈ పనులను రెండురోజుల్లోపు పూర్తి చేయిస్తానని ఆర్డీఎస్‌ ఏఈ రామదాసు తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయగలిగామని, ఆగస్టులో కాలువకు నీరు వస్తే ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన చెప్పారు.

Updated Date - Jul 14 , 2024 | 10:17 PM