Share News

ఇలపై హరివిల్లు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:26 PM

ఇలపై హరివిల్లు ముద్దాడినట్లు రంగు రంగుల రంగవల్లులు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

 ఇలపై హరివిల్లు
నాగర్‌కర్నూల్‌లో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గులు వేస్తున్న యువతలు

- నాగర్‌కర్నూల్‌లో ఆకట్టుకున్న ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీ

- తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాలి

- నాగర్‌కర్నూల్‌ ఆర్డీవో రాంరెడ్డి

- ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా సరిత, రమ్యశ్రీ, మౌనిక

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 6: ఇలపై హరివిల్లు ముద్దాడినట్లు రంగు రంగుల రంగవల్లులు వీక్షకులను ఆకట్టుకున్నాయి. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ‘కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ వారి సహకారంతో నిర్వహించారు. పోటీల్లో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి మహిళలు, యువతులు పాల్గొని రంగు రంగులతో ముత్యాల ముగ్గులు వేసి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ మహ్మద్‌ అబ్దుల్లాఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన బహుమతుల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్‌కర్నూల్‌ ఆర్డీవో రాంరెడ్డి, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కల్పన హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరం యువత కాపాడాలని అన్నారు. పోటీల్లో మొదటి బహుమతి రూ.6000 కల్వకుర్తి పట్టణానికి చెందిన కె.సరిత అందుకోగా, నాగర్‌కర్నూల్‌ సాధన డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎం.రమ్యశ్రీ రూ.4000 ద్వితీయ బహుమతి, పెద్దకొత్తపల్లి శ్రీనివాస పద్మావతి జూనియర్‌ కళాశాల విద్యార్థిని ఎం.మౌనిక రూ.3000 తృతీయ బహుమతి అందుకున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల నగదు స్పాన్సర్లు వికాస తరంగిణి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు దొడ్ల ఇందుమతి, గీతాంజలి జూనియర్‌ కళాశాల యాజమాన్యం తీగల సునేంద్ర, దాస్‌పల్లి ఎంపీటీసీ సభ్యుడు సి.శ్రీనివాస్‌రెడ్డి కాగా.. నాగర్‌కర్నూల్‌కు చెందిన నేచర్స్‌ బ్యూటీ పార్లర్‌ ముగ్గురికి కన్సోలేషన్‌ బహుమతులను అందజేసింది. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా దొడ్ల ఇందుమతి, కందికొండ గీత వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి ఏడీవీటీ ఇన్‌చార్జి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:26 PM