Share News

వర్ష బీభత్సం

ABN , Publish Date - May 20 , 2024 | 11:14 PM

నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సోమవారం వర్షం బీభత్సం సృష్టించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పిడుగు పాటుకు నాలుగు గొర్రెలు మృతి చెందగా, రెండు జిల్లాల్లోనూ చెట్లు, విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దాంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

వర్ష బీభత్సం
ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామంలో రచ్చకట్ట వద్ద కూలిన వేప చెట్టు

పిడుగుపాటుకు నాలుగు గొర్రెలు మృతి

జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

పెద్దకొత్తపల్లి/మన్ననూరు/అచ్చంపేట టౌన్‌/అలంపూర్‌ చౌరస్తా, మే 20: నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సోమవారం వర్షం బీభత్సం సృష్టించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పిడుగు పాటుకు నాలుగు గొర్రెలు మృతి చెందగా, రెండు జిల్లాల్లోనూ చెట్లు, విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దాంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామ శివారులో నాగర్‌కర్నూల్‌ మండలం బొందలపల్లి గ్రామానికి చెందిన దండు వెంకటయ్య తన గొర్రెలను పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామ శివారుకు మేత కోసం తీసుకొచ్చాడు. సోమవారం సాయంత్రం వర్షం కురిసి పిడుగు పడటంతో జూగుండ్ల సమీపంలో ఉన్న నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ రూ.60 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు.

స్తంభాలను పరిశీలించిన ఏఈ

అచ్చంపేట పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వానకు పట్టణంలోని రహదారులు జలమయం అయ్యాయి. ఐనోల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో 33 కేవీ లైన్‌ విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. విరిగిన స్తంభాలను ఏఈ ఆంజనేయులు పరిశీలించారు. ఐదు స్తంభాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, మరమ్మతులు ప్రారంభించామని చెప్పారు.

కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన గాలివానకు పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు వరిగిపోయాయి. ఉండవల్లి మండల పరిధిలోని మెన్నిపాడు, కలుగొట్ల, పుల్లూరు, మానవపాడు మండలంలోని చెన్నిపాడు, పోతులపాడు, గోకులపాడు, మానవపాడు, అమరవాయితో పాటు పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. పలుచోట్ల ఇన్సులేటర్లు ఫెయిల్‌ అయ్యాయి. బొంకూరు గ్రామంలో ఏడు విద్యుత్‌ స్తంబాలు విరిగిపోయాయి. ఇక శాంతినగర్‌ ఫీడర్‌ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ లైనులో ఏడు చోట్ల ఇన్సులేటర్లు డ్యామేజీ అయ్యాయి. దీంతో కలుకుంట్ల ఫీడర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే పలు గ్రామాలకు, అలంపూర్‌ చౌరస్తా ఫీడర్‌ నుంచి సరఫరా అయ్యే వివిధ గ్రామాలకు ఆదివారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బొంకూరు పంచాయతీ కార్యాలయం ముందు విరిగిన చెట్టును తొలగించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గ్రామస్థులు అంటున్నారు.

ఆ గ్రామాలకు కరెంట్‌ కట్‌

నల్లమల అభయారణ్య ప్రాంతం మన్ననూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో మన్ననూరు అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలోని ఐదు విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. అచ్చంపేట నుంచి అమ్రాబాద్‌, పదర మండలాలకు విద్యుత్‌ సరఫరా అయ్యే లైన్‌ తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అప్పర్‌ ప్లాట్‌లోని గ్రామాలన్నీ సోమవారం రాత్రి అంధకారంలో మగ్గాయి. విద్యుత్‌ ఏఈ రమేష్‌, లైన్‌మెన్‌లు శేఖర్‌ గౌడ్‌, శంకర్‌ గౌడ్‌, ఇతర సిబ్బంది కూలిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

Updated Date - May 20 , 2024 | 11:14 PM