Share News

నాణ్యత నగుబాటు

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:59 PM

తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా పాలమూరు మునిసి పాలిటీలో అందరూ పర్సెంటేజీలు తీసుకుంటూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు.

నాణ్యత నగుబాటు
పాలమూరు పురపాలిక కార్యాలయం

- అభివృద్ధి పనుల బిల్లుల్లో చేతివాటం

- పాలమూరు పురపాలికలో అధికారులు, పాలకులకు పర్సెంటేజీ

- కింగ్‌మేకర్‌లా ఓ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌

మహబూబ్‌ నగర్‌, ఫిబ్రవరి 17: తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా పాలమూరు మునిసి పాలిటీలో అందరూ పర్సెంటేజీలు తీసుకుంటూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మనిషి మనిషికి ఒక రేటును ఫిక్స్‌ చేసి డబ్బులు దండుకుంటున్నారు. అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్‌ ఇలా అందరూ ఏకమై పనుల పర్యవేక్షణ గాలి కొదిలేశారు. ఏ శాఖలోనైనా పర్సెంటేజీలు తీసుకోవడం బహిరంగ రహస్యమే అయితే.. 10-12 శాతం వచ్చిన బిల్లు లో పర్సెంటేజీలు ముట్టజెప్పాల్సి ఉంటుంది. కానీ పాలమూరు పుర పాలికలో మాత్రం ఏకంగా 20-22 శాతం పర్సెంటేజీ లు ఇచ్చుకోవాల్సి వ స్తోంది. అధికారి స్థాయి, వార్డుల సంఖ్యను బట్టి పర్సెంటేజీని నిర్ణయించారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఈ, డీఈ, ఎంఈ, కమిషనర్‌ సెక్షన్‌ క్లర్క్‌, అకౌంట్‌ సెక్షన్‌, ఇక కౌన్సిలర్‌ టూ చైర్మన్‌ వరకు ఇలా ఒక్కొక్కరి స్థాయిని బట్టి 0.5 పర్సెంటేజీ నుంచి 3-4 పర్సెంటేజీ వరకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కొందరు అధికారులు హైదరాబాద్‌కు కాంట్రాక్టర్‌లను పిలిపించుకుని అక్కడే డబ్బులు తీసుకుంటారన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్‌ 20 శాతం చెల్లించాలంటే అతనికి మరో 20 శాతం మార్జిన్‌ ఉండేలా చూడాలి. అంటే లక్ష రూపా యల ఖర్చుతో చేయాల్సిన పనులు రూ.60 వేలు లోపే పూర్తిచేయాల్సి ఉంటుంది. అందుకే అధికా రులు చూసీచూడ నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు జరిగేటపుడు అధికారు లు, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. డీఈ, ఎంఈ పనులను పరిశీలించాల్సి ఉంటుంది. చాలా పనులను యంత్రాంగం నామ మాత్రంగా తనిఖీలు చేయడంతో కాంట్రాక్టర్‌లు ఇష్ఠానుసారంగా పనులు చేస్తున్నారన్న విమర్శ లున్నాయి. పనులు పూర్తైన తరువాత ఎంబీ రికార్డ్‌ చేసే ముందు క్వాలిటీ కంట్రోల్‌ అధి కారులు వచ్చి సీసీరోడ్డు ఎంత మందం లో వేశారో అనే విషయమై రహదారి పై ర్యాండమ్‌గా తవ్వి శాంపిల్స్‌ సేకరించేవారు. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్‌ ఎక్కడా ఇలాంటి పని చేయడం లేదని స్పష్ఠమవు తోంది.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర కీలకం..

పనులు జరిగేటప్పుడు అక్కడే ఉండి పనులు చూసుకునేందుకు ఏఈలు తమ కింద వర్క్‌ఇన్‌స్పెక్టర్‌లను నియమించుకుంటారు. ఇలా పాలమూరు పురపాలికలో 5-6 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్‌లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి 8-10 వార్డుల బాధ్యతలు అప్పగించారు. వీరు పనిజరిగే చోట నిరంతర పర్యవేక్షణ చేస్తుండాలి. అలా కాకుండా దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు ఓ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ తన వార్డుల పరిధిలో జరిగే పనుల్లో కాంట్రాక్టర్‌తో జతకలిసి పెట్టుబడులు పెడుతూ తనూ కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తారన్న ఆరోపణలున్నాయి. ఓ కౌన్సిలర్‌ బంధువు పేరిట పనులు తీసుకుని ఈ తతాంగం నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం పసిగట్టిన కొందరు ఆ అధికారిని ఏసీబికి పట్టించారన్న ప్రచారం జరుగుతోంది. మునిసిపాలిటీలో ఏళ్ళ తరబడి సాగుతున్న వ్యవహారం ఇప్పుడే ఎందుకు ఏసీబీ వరకు వెళ్లిందంటే ఇదే కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా పురపాలికలో కాంట్రాక్టర్‌లు అధికారుల మధ్య పరస్పర సహకారం ఉంది. అందుకే పనులు నాణ్యత లేకుండా చేపడుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Feb 17 , 2024 | 11:59 PM