మహిళా టెక్నీషియన్ లేక ఇక్కట్లు
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:12 PM
జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు ఒక్కొక్కటిగా అమరుతున్నాయి కానీ వైద్యులు, సిబ్బంది కొరత మాత్రం తీరడం లేదు.
- ఈసీజీ, ఎక్స్‌రేల కోసం అధికంగా వస్తున్న మహిళలు
- పురుష సిబ్బందే ఉండటంతో ఇబ్బందులు
- సమస్య పరిష్కారానికి చర్యలు : డాక్టర్ నవీన్‌క్రాంతి
గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 6 : జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు ఒక్కొక్కటిగా అమరుతున్నాయి కానీ వైద్యులు, సిబ్బంది కొరత మాత్రం తీరడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా అందుకు తగినట్లు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం సమస్యగా మారింది. ఆసుపత్రిలో అధునాధన టెక్నాలజీతో ఎక్స్‌రే, ఈసీజీ మిషన్లు ఉన్నాయి కానీ మహిళా సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. పురుష సిబ్బందే వైద్య సేవలందించడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
పదుల సంఖ్యలో పరీక్షలకు మహిళలు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈసీజీ కొరకు ప్రతీ రోజు 50 మంది వరకు వస్తున్నారు. వారిలో 22 నుంచి 25 మంది వరకు మహిళలు, యువతులే ఉన్నారు. ఎక్స్‌రేల కోసం దాదాపు 50 మంది వస్తుండగా, వారిలో 25 నుంచి 30మంది వరకు మహిళలు, యువతులు వస్తున్నారు. అయితే మహిళా సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. యువకులైన టెక్నీషియన్లే పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలకు డబ్బులు చెల్లించలేక కొందరు ఇబ్బంది పడ్తూనే పరీక్షలు చేయించుకుం టున్నారు. మరికొందరు మాత్రం వెనుదిరిగి, ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.
ఎక్స్‌రే, ఈసీజీలకు ఒక్కరే ఉద్యోగి
వివిధ పరీక్షల కోసం రోజూ 50 నుంచి 60 మంది వరకు వస్తుండటంతో వారంతా తమ వంతు కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఎక్స్‌రే, ఈసీజీల ల్యాబ్‌లకు సంబంధించి ఒకే ఒక్క పురుష ఉద్యోగి ఉన్నారు. ఆయనే అన్ని పరీక్షలు చేయాల్సి రావడం మహిళలకు ఇబ్బందిగా మారింది. మెమోగ్రఫీ సేవలకు ఒక మహిళా ఉద్యోగి ఉన్నారు. కానీ పరీక్షల కోసం ఎక్కువ మంది మహిళలు వచ్చినా, ఆ ఉద్యోగి సెలవుపై వెళ్లినా, పురుష ఉద్యోగే సేవలు అందించాల్సి వస్తోంది. మహిళా టెక్నీషియన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మహిళా సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
ట్రైనీ టెక్నీషియన్‌ను నియమిస్తాం
ఎక్స్‌రే, ఈసీజీల కోసం వచ్చే మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతానికి మహిళా ట్రైనీలను నియమించి, మహిళలకు, యువతులకు ఎక్స్‌రే, ఈసీజీలు తీయించేందుకు కృషి చేస్తాం. ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించే విషయంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- డాక్టర్ నవీన్‌క్రాంతి, సూపరింటెండెంట్