పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:08 PM
పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. రాజోలి మండలకేంద్రంతో పాటు పచ్చర్ల, తూర్పు గార్లపాడు, ముండ్లదిన్నె, తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొన్నది.

- వర్షం వస్తే రహదారులపై నిలుస్తున్న నీరు
- పంచాయతీలకు అందని కేంద్రం నిధులు
రాజోలి, జూలై 28 : పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. రాజోలి మండలకేంద్రంతో పాటు పచ్చర్ల, తూర్పు గార్లపాడు, ముండ్లదిన్నె, తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొన్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారాయి. పచ్చర్లలోని ఓ కాలనీలో సీసీ రోడ్డు కంటే ఎక్కువ ఎత్తులో డ్రైనేజీ నిర్మించడంతో రోడ్డుపై మురుగునీరు నిలుస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎంపీవో స్పం దించి రోడ్డుపై తాత్కాలికంగా మొర్రం వేయించారు. సమస్యకు శాశ్వతపరిష్కారం చూపాలని ప్రజలు కోరుతు న్నారు. మరికొన్ని కాలనీల్లో సీసీ రోడ్లు వేసి, డ్రైనేజీలు నిర్మించకపోవడంతో రహదారులు బరదమయంగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.
నిలిచిపోయిన నిధులు
గ్రామ పంచాయతీలకు ప్రతీ నెల కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు ఏడు నెలలుగా రావడం లేదు. మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు ప్రతీ నెల దాదాపు రూ. 30లక్షల నిధులు వచ్చేవి. అందులో మండల కేంద్రమైన రాజోలికి రూ. 16 లక్షలు వచ్చేవి. సర్పంచు, పంచాయతీ కార్యదర్శి పేరునున్న జాయింట్ ఖాతాలో ఈ నిధులు జమయ్యేవి. ఆరు నెలల క్రితం సర్పంచుల కాలపరిమితి ముగిసింది. దీంతో గత ఏడాది డిసెంబరు నుంచి నిధులు రావడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఉన్న నిధులతోనే తాత్కాలిక పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నిధులు లేకున్నా, కార్యదర్శులు చేతి నుంచి ఖర్చు చేసి బిల్లులు పెట్టినా, నిధులు మంజూరు రావడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు, ఇతర సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్లపై మురుగునీరు నిలుస్తోంది
సావిత్రమ్మ, పచ్చర్ల : గ్రామంలో పారిశుధ్యం కొరవడింది. మురుగు నీరు రోడ్లపైనే పారుతోంది. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. రోడ్లుపై వర్షం నీరు నిల్వ కూడా చూడాలి. డ్రైనేజీలను శుభ్రం చేయించాలి.
డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి
హనుమంతు, తూర్పు గార్లపాడు : గ్రామంలో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షకాలంలో సీసీ రోడ్లపై నీరు నిలుస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. అధికారులు స్పందించి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి. మురుగు నీరు నిలువ కుండా చర్యలు తీసుకోవాలి.
పారిశుధ్య పనులు చేపడుతున్నాం
గ్రామాల్లో పంచాయతీ కార్మికులతో పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో వర్షం పడినప్పుడు రోడ్లపై నీరు నిలుస్తోంది. స్థానికులు సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకొని శుభ్రం చేయిస్తాం. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
- ఖాజామొద్దీన్, ఎంపీవో