పార్లమెంటు ఎన్నికల సందడి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:26 PM
పాలమూరులో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోన్న ప్రధాన పార్టీలు, అభ్యర్థిత్వం ఆశిస్తోన్న నాయకుల హడావిడి కొనసాగుతోంది.

పోటాపోటీగా వెలిసిన హోర్డింగులు
ఊపందుకున్న నాయకుల సమావేశాలు, పర్యటనలు
మన్నెజీవన్‌రెడ్డి హోర్డింగులపైనే సర్వత్రా చర్చ
మహబూబ్‌నగర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): పాలమూరులో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోన్న ప్రధాన పార్టీలు, అభ్యర్థిత్వం ఆశిస్తోన్న నాయకుల హడావిడి కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి సారించిన ఆశావహులు దూకుడు పెంచారు. ఒకవైపు టికెట్ కోసం అధిష్ఠానంతో, ముఖ్య నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ, మరోవైపు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
పండుగ శుభాకాంక్షలతో..
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోన్న కీలక నాయకులు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ పోటాపోటీగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో శుభాకాంక్షల హోర్డింగులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తోన్న మాజీ మంత్రి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తోన్న ఆ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, అవకాశమొస్తే ఎంపీగా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తోన్న ప్రముఖ పారి శ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి ఈ హోర్డింగులు ఏర్పాటు చేశారు. వీరు హోర్డింగులను ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
పెరిగిన సమావేశాల జోరు
పార్లమెంటు ఎన్నికలకు ఇంకా మూడు నెలల గడువున్నప్పటికీ ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై ఇప్పటికే దృష్టి సారించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అప్రతిహత విజయాలు నమోదు చేసిన కాంగ్రెస్.. అదే ఊపుతో పార్లమెంట్ సీటును గెలవాలనే లక్ష్యంతో దూసుకెళుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండటంతో గెలవడమే ఏకైక లక్ష్యంగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. పార్టీలో అత్యున్నత హోదాలో ఉన్న వంశీచంద్‌రెడ్డికే దాదాపు టికెట్ వస్తుందనే సమాచారం ఆ పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష అనంతరం నియోజకవర్గంలో వంశీచంద్‌రెడ్డి కార్యాచరణలో దూకుడు పెరిగింది. సమావేశాలు, కార్యక్రమాలకు ఆయన విధిగా హాజరవుతుండటం పోటీకి ఆయన సిద్ధమవుతున్న వాతావరణాన్ని సూచిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ద్వితీయ స్థానంలో నిలిచిన డీకే అరుణ సైతం మరోసారి బరిలో నిలవాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మన సంకల్పం-వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు, క్షేత్ర స్థాయి నాయకులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అదే పార్టీలో టికెట్ ఆశిస్తోన్న మాజీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి సైతం మరోవైపు నియోజకవర్గంలో పర్యటనల ఉధృతి పెంచారు. క్యాడర్‌తో అనుసంధానమవుతూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆ పార్టీలో టికెట్ ఆశిస్తోన్న పార్టీ రాష్ట్ర కోశాధికారి బి.శాంతకుమార్ సైతం ఈసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ చేపట్టిన వికసిత సంకల్ప యాత్రలో, పార్టీ క్యాడర్‌తో సమావేశాల్లో పాల్గొంటున్నారు. డోర్ స్టిక్కర్లు, పార్టీ ప్రచార పత్రాలను పంపిణీ చేస్తున్నారు.
అవకాశమిస్తే ఎంపీగా పోటీ
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో వేయించిన హోర్డింగులు చర్చనీయాంశం అయ్యాయి. జీవన్‌రెడ్డి చిన్నాన్న ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి ఇప్పటికీ బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నారు. కానీ జీవన్‌రెడ్డి హోర్డింగులలో బ్యాక్‌గ్రౌండ్‌లో త్రివర్ణంతో పాటు, జీవన్ ఒక్కరి ఫొటో తప్ప వేరే ఏ నాయకుడి పొటో లేకపోవడంపై పలు రకాల చర్చ కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డితో జీవన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు కాంగ్రెస్ అవకాశమిస్తే జీవన్‌రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ ఇటీవల సాగిన నేపథ్యంలో ఈహోర్డింగులపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఎంపీగా అవకాశమొచ్చినా.. రాకపోయినా కాంగ్రెస్ ద్వారా జీవన్‌రెడ్డి రాజకీయాల్లో కొనసాగడం ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.