Share News

ఆపరేషన్‌ ఆకర్ష్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:44 PM

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభీ మోగించిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని గ్యారెంటీ పథకాలను అమల్లోకి తేవడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చేపట్టింది.

ఆపరేషన్‌ ఆకర్ష్‌

పార్లమెంట్‌ ఎన్నికల వేళ పాలమూరు సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ ఎత్తుగడ

తెరవెనుక చక్రం తిప్పుతున్న ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి

నారాయణపేటలో బీజేపీ నుంచి చేరికలకు ప్రోత్సాహం

సీఎం సొంత జిల్లా కావడంతో విజయం సాధించడంపై ప్రత్యేక దృష్టి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభీ మోగించిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని గ్యారెంటీ పథకాలను అమల్లోకి తేవడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చేపట్టింది. అన్ని జిల్లాల్లో ముఖ్యమైన, సీనియర్‌ నాయకులను పార్టీలోకి చేర్చుకుంటూ.. పూర్వవైభవం తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాన పోటీదారులుగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉండగా.. కాంగ్రెస్‌, బీజేపీ స్థాయిలో బీఆర్‌ఎస్‌ ఇంకా ప్రచారంలో వేగం పెంచలేదు. పాలమూరు స్థానం నుంచి బీజేపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎంపీ, ఆ పార్టీ నాయకుడు ఏపీ జితేందర్‌రెడ్డి.. డీకే అరుణకు టికెట్‌ దక్కడంతో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఆయనకు రెండుసార్లు గెలిచిన అనుభవం ఉంది. ఒకసారి బీజేపీ నుంచి గెలవగా.. మరోసారి బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. పలు ఎన్నికల్లో బీజేపీ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉండి.. విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు కాంగ్రె్‌సలో చేరుతున్నారు. అయితే పాలమూరు స్థానంలో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుతో ఉన్న ఆమె ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సర్వేలు, అంచనాల ప్రకారం ఈ స్థానంలో నెక్‌ టూ నెక్‌ ఫైట్‌ ఉంటుందని సమాచారం. అందుకే ఏ పార్టీ కూడా ఎన్నికను సులువుగా తీసుకోవడం లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కోస్గిలో బహిరంగ సభ నిర్వహించగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కూడా సభలో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ సమయంలో.. ఇటీవల కొడంగల్‌లో కాంగ్రెస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 15న నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే జనజాతర సభలో మరోసారి పాల్గొననున్నారు. సమీపంలో బలమైన ప్రత్యర్థి ఉన్నందుకే కాంగ్రెస్‌ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

కీలక నాయకుల రాజీనామా..

బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజాప్రతినిధిగా పలుమార్లు గెలిచింది. ఆమెది గద్వాల కాగా.. పుట్టి, పెరిగిన ప్రాంతం మాత్రం నారాయణపేట జిల్లా ధన్వాడ. ఇక్కడ ఆమెకు బంధువర్గంతో పాటు పుట్టింటి తరపు వారు కూడా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఈ జిల్లా పరిధిలో కొంత తమకే బలం ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తుండగా.. అన్ని పార్టీలు, అభ్యర్థులు అంతర్గతంగా సర్వేలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించే కొడంగల్‌లో తమకు బంపర్‌ మెజారిటీ వస్తుందని కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కొడంగల్‌లో ప్రచారం విషయంలో రేవంత్‌రెడ్డి, డీకే అరుణ మధ్య మాటల యుద్ధం కూడా నడిచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నారాయణపేటలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ను కాంగ్రెస్‌ చేపడుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజు జితేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. అలాగే బీజేపీ సీనియర్‌ నాయకుడు, నారాయణపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రతంగ్‌ పాండురెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్‌ కూడా రాజీనామా చేశారు. జితేందర్‌రెడ్డి అనుచరుడిగా పేరున్న మక్తల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మదిరెడ్డి జలంధర్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. జితేందర్‌రెడ్డి గురువారం నారాయణపేటలో పర్యటించిన రోజు రాత్రే ఈ రాజీనామాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. వారంతా కాంగ్రె్‌సలో చేరతారా? లేదా? అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు.

సీఎం సభలో చేరికలు?

రాజీనామా చేసిన నాయకులతోపాటు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా పలువురు ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే కాంగ్రెస్‌ జన జాతర సభలో కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో అందరూ చేరుతారా? లేక ఒకరిద్దరు మాత్రమే పార్టీ కండువా కప్పుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ నారాయణపేట జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే బూత్‌ లెవల్‌ ఏజెంట్ల దగ్గర నుంచి సామాజిక, వ్యాపార, మహిళ వర్గాల వారీగా అభ్యర్థులు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి విడుదల చేసిన మీ మాట.. మా మేనిఫెస్టోపై సూచనలు స్వీకరించారు. ఆ లోకల్‌ మేనిఫెస్టోను కూడా జన జాతర సభలో ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Apr 12 , 2024 | 10:44 PM