Share News

ఓం నమశ్శివాయ

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:13 PM

ఐదవ శక్తిపీఠం అలంపూర్‌లో శివరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఓం నమశ్శివాయ
అలంపూర్‌లోని ఆలయంలో యాగశాలలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

- అలంపూర్‌ క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం

- బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

- జోగుళాంబ ఆలయంలో కుంకుమార్చన

అలంపూర్‌, మార్చి 4 : ఐదవ శక్తిపీఠం అలంపూర్‌లో శివరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అధికారుల ఆధ్వర్యంలో అర్చకులు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు మహాగణాధిపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనము, నాంది దేవతా ఆహ్వనం, యాగశాల ప్రవేశం, హోమం, అంకురార్పణ, అగ్నిమథనము, అగ్ని ప్రతిష్ఠ తదితర విశేష పూజలు చేశారు.

- బాలబ్రహ్వేశ్వర స్వామి ఆలయంలో అఖండ భజన సప్తాహం నిర్వహించిన భజన మండలి సభ్యులను ఆలయ చైర్మన్‌ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురందర్‌కుమార్‌, ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ ఘనంగా సన్మానించారు.

- జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి పేరిట లక్ష గలార్చన చేసిన హైదరాబాద్‌కు చెందిన నందనను ఈవో పురందర్‌ కుమార్‌, చైర్మన్‌ చిన్న కృష్ణయ్య ఘనంగా సత్కరించారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి అభినందించారు.

- స్వామి అమ్మవార్లకు కర్నూలుకు చెందిన భక్తుడు, ఆర్డీవో సత్యనారాయణరెడ్డి నూతన రథాన్ని అందజేశారు. అంతకు ముందు అర్చకులతో కలిసి నూతన రథానికి పూజలు చేశారు.

- కర్నూలుకు చెందిన భక్తుడు, డెంటల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆలయానికి రూ. 50 వేల విలువైన వెండిగిన్నెను వితరణ చేశారు. సోమవారం దానిని ఆలయ చైర్మన్‌ చిన్న కృష్ణయ్య నాయుడు, ఈఓ పురందర్‌కుమార్‌లకు అందించారు. క్షేత్రంలోని అన్నదాన సత్రానికి రూ.1116 విరాళం ఇచ్చారు.

Updated Date - Mar 04 , 2024 | 11:13 PM