Share News

సారు.. జర చూడరూ

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:28 PM

అలంపూర్‌ వంద పడకల ఆస్పత్రికి నిర్లక్ష్యపు గ్రహణం పట్టుకుంది. అందరికీ అందుబాటులో ఉంటుందని అలంపూర్‌కు బదులు అలంపూర్‌ చౌరస్తాలో ఈ ఆస్పత్రి నిర్మించారు. పేరుకు భవనాన్ని ప్రారంభించారు తప్ప.. ఇప్పటివరకు సేవలను మాత్రం మొదలుపెట్టలేదు.

సారు.. జర చూడరూ
అలంపూర్‌ చౌరస్తాలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి

అలంపూర్‌ వంద పడకల ఆస్పత్రికి గ్రహణం

కల్పించని మౌలిక వసతులు

నియామకం కాని డాక్టర్లు, ఇతర సిబ్బంది

ఎన్నికల ముందే ఆస్పత్రి ప్రారంభించినా సేవలు కరువు

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పట్టించుకోవాలని విన్నపాలు

గద్వాల, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అలంపూర్‌ వంద పడకల ఆస్పత్రికి నిర్లక్ష్యపు గ్రహణం పట్టుకుంది. అందరికీ అందుబాటులో ఉంటుందని అలంపూర్‌కు బదులు అలంపూర్‌ చౌరస్తాలో ఈ ఆస్పత్రి నిర్మించారు. పేరుకు భవనాన్ని ప్రారంభించారు తప్ప.. ఇప్పటివరకు సేవలను మాత్రం మొదలుపెట్టలేదు. కుంటి సాకులు చెప్పడం అధికారుల వంతుగా మారగా.. పట్టింపులేనితనం ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో సేవలను ప్రారంభించాలని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడికి విన్నవిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి సమీక్షలో దీనిపై ప్రస్తావించినప్పటికీ.. అది ముగిసి నెలరోజులు దాటినా ఇప్పటివరకు ఆచరణ యోగ్యమైన కార్యాచరణను ప్రారంభించలేదనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ, ప్రతీ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలకు శంకుస్థాపన చేసింది. రెండో విడత ప్రభుత్వంలో పలు నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేసి, నిర్మించిన మెజారిటీ ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. బీఆర్‌ఎస్‌ మొదటి విడత ప్రభుత్వంలోనే మంజూరైన అలంపూర్‌ ప్రభుత్వాస్పత్రిలో మాత్రం సేవలు నేటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. స్థానికంగా మెరుగైన వైద్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రైవేటు మెడికల్‌ హబ్‌గా ఉండటంతో ప్రజలు అక్కడకి వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారు. అక్కడి మెడికల్‌ మాఫియా దెబ్బతింటుందనే ఉద్దేశంతో కూడా అలంపూర్‌ ఆస్పత్రిలో సేవలను అందుబాటులోకి తేవడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తికాగా.. ఫర్నిచర్‌ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కేవలం డాక్టర్ల కేటాయింపు, పారా మెడికల్‌, ఇతరత్రా సిబ్బంది నియామకాలు, నీరు, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. గత ఎన్నికల్లో గెలవడానికి రూ.కోట్లు కుమ్మరించిన నాయకులు పేద ప్రజలకు ఉపయోగపడే ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

2018లోనే మంజూరు..

అలంపూర్‌ నియోజకవర్గం పూర్తిగా జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. దాంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలంపూర్‌ పట్టణంలో ఉన్న 30 పడకల ఆస్పత్రి నియోజకవర్గంలోని ఒక్క ఉండవల్లి మినహా మిగతా మండలాలకు దూరంగా ఉండటంతో వైద్యం కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం పొందాల్సి వస్తే.. కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. 2016లో కృష్ణా పుష్కరాలకు అలంపూర్‌ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అప్పటి డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ఆస్పత్రి ఏర్పాటుకు జీవో వెలువడింది. తర్వాత ఎమ్మెల్యేగా డాక్టర్‌ వీఎం అబ్రహాం గెలుపొందారు. 30 పడకల ఆస్పత్రి ఉన్నచోటే వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తే ఎప్పటిలాగే మిగతా మండలాల ప్రజలకు ఇబ్బంది అవుతుందని భావించిన అబ్రహాం దాన్ని అలంపూర్‌ చౌరస్తాకు మార్చారు. దాంతో అలంపూర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరగడంతో నిర్మాణానికి చాలా రోజులు ఆలస్యమైంది. ఎట్టకేలకు 2021 సెప్టెంబరులో రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసి.. అప్పటి మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్రహాం ఆస్పత్రిని ప్రారంభించారు. సాధారణంగా ఆస్పత్రి ప్రారంభం అంటే అందులో సేవలు ప్రారంభం కావాలి. కానీ ఆస్పత్రిని ప్రారంభించి.. సేవలను అందించకుండా అధికారులు కూడా కాలయాపన చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి విజయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆస్పత్రిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే.. క్యాంపు ఆఫీసులోకి ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. అలంపూర్‌ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలంతా వైద్యం కోసం కర్నూలుకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.

ఇవే అడ్డంకులు..

జోగుళాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారి మొత్తం అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నది. దాదాపు 50 కిలోమీటర్లపైన రహదారి ఉండగా, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జాతీయ రహదారిపై ఎక్కడా పెద్ద ఆస్పత్రులు లేవు. మిగతా జిల్లా కేంద్రాలు జాతీయ రహదారికి చాలా దూరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలంపూర్‌ చౌరస్తాలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణంతో ట్రామాకేర్‌గా గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు ఉండాలి. కానీ ఇప్పటివరకు సేవలనే అందుబాటులోకి తేలేకపోతున్న పరిస్థితి ఉంది. ఈ ఆస్పత్రిలో ప్రధానంగా క్యాజువాలిటీ, ఓపీ, ఎంసీహెచ్‌(మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌) సేవలు అందాల్సి ఉంది. ఎక్కువగా ఎంసీహెచ్‌ సేవలు అందాల్సి ఉండగా, లేబర్‌ వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌, యాంటినేటల్‌ వార్డు, పోస్ట్‌ నేటల్‌వార్డులు ఉంటాయి. వీటితోపాటు జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌ వార్డులు కూడా ఉన్నాయి. ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించారు. ఆక్సీజన్‌ ప్లాంటు లేకపోయినప్పటికీ.. 60 బెడ్లకు ఆక్సీజన్‌ సిలిండర్లు పంపిణీ చేసే పైపులు ఉన్నాయి. డాక్టర్లు సుమారు 25 మంది, 40 మంది స్టాఫ్‌ నర్సులు, 40 మంది ఇతరత్రా సిబ్బంది అవసరం ఉండగా.. అలంపూర్‌లో ఉన్న 30 పడకల ఆస్పత్రిలో గల 12 మంది డాక్టర్లు, 20 మంది స్టాఫ్‌ నర్సులు, 12 మంది సానిటేషన్‌ సిబ్బందినే ఈ ఆస్పత్రికి వాడుకోవాలని చెప్పడం గమనార్హం. ఇక్కడ ఆ సిబ్బందిని వాడుకుంటే.. వారు ఇక్కడ సరిపోక పోగా... అక్కడా సేవలు అందించలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు కొత్త నియామకాలు చేపట్టలేదు. అలాగే విద్యుత్‌ కనెక్షన్‌ సమస్య, పాత పెండింగ్‌ బకాయి, జనరేటర్‌, కాంపౌండ్‌వాల్‌ అసంపూర్తిగా ఉండటం, ఆస్పత్రికి వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడం వంటి చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికే నెలలు సమయం పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

వెంటనే వినియోగంలోకి తేవాలి

ఉమ్మడి రాష్ట్రంలో చిన్న జబ్బు చేసినా కర్నూల్‌ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చూపించుకునేవాళ్లం. రాష్ట్ర ఆవిర్భావ ఆనంతరం నడిగడ్డ ప్రాంతవాసులమైన మేము కర్నూలుకు వెళ్తే సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. దీనిని దృష్టిలో ఉంచుకుని గత ఎమ్మెల్యేలు ఇక్కడి ప్రజలకు సరైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో అలంపూర్‌ చౌరస్తాలో వంద పడకల ఆసుపత్రి నిర్మించారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని ఆస్పత్రికి ఆవసరమైన పరికరాలను, డాక్టర్లను, సిబ్బందిని కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలి.

- అనంతేశ్వరరెడ్డి చెన్నిపాడు, మనవపాడు

జబ్బు చేస్తే కర్నూలు వెళ్తున్నాం

కాస్త జబ్బు చేసినా కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. ఇక గర్భిణులు చాలామంది కాన్పులకు కర్నూలులోని ప్రైవేటు దవాఖానాలకు వెళ్తున్నారు. అక్కడ రూ.వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. అత్యాధునిక స్థాయిలో వైద్యశాల నిర్మించామని చెప్పారు. కానీ నేటికి ఇక్కడ వైద్యం అందించడం లేదు. కాళ్లనొప్పులతో ఆటోలలో కర్నూలుకు వెళ్లి రావాలంటే పానం మీదికి వస్తుంది. ఇక్కడే వైద్యం అందితే చార్జీలు, వైద్య ఖర్చులు మిగులుతాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.

- దొడ్ల సుంకులమ్మ, లింగనవాయి, అలంపూర్‌

వైద్యవిధాన పరిషత్‌కు నివేదించాం

అలంపూర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వంద పడకల ఆస్పత్రిలో పెండింగ్‌ పనులు, కావాల్సిన సౌకర్యాలు, డాక్టర్ల నియామకం తదితర అంశాలపై వైద్య విధాన పరిషత్‌కు బుధవారం నివేదిక పంపించాం. వాస్తవానికి అక్కడ విద్యుత్‌ సమస్య ఉంది. కాంట్రాక్టర్‌కు పెండింగ్‌ బిల్లు చెల్లించాల్సి ఉంది. అలాగే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే సేవలు కొనసాగించడానికి జనరేటర్‌ సదుపాయం లేదు. రోడ్డు నుంచి ఆస్పత్రికి వచ్చేందుకు కేవలం మట్టి రోడ్డే ఉంది. కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడంతో పందులు, కుక్కలు లోపలికి వస్తున్నాయి.

- డాక్టర్‌ కిషోర్‌కుమార్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటిండెంట్‌

Updated Date - Jan 05 , 2024 | 11:28 PM