Share News

నీడ లేదు.. నీళ్లు లేవు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:36 PM

మండుటెండల్లో నిలువ నీడ, తాగు నీటి వసతి లేకపోవడంతో జాతీయ ఉపాధి గ్రామీణ పథకంలో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీడ లేదు.. నీళ్లు లేవు
శాసన్‌పల్లి గ్రామా శివారుల్లో ఎండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు

- పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు రక్షణ కరువు

- మండుతున్న ఎండలతో తప్పని తిప్పలు

- పెండింగ్‌ కూలి డబ్బులతో ఆర్థిక ఇబ్బందులు

- జిల్లాలో 1,32,771 ఉపాధి జాబ్‌ కార్డులు

నారాయణపేట, ఏప్రిల్‌ 7 : మండుటెండల్లో నిలువ నీడ, తాగు నీటి వసతి లేకపోవడంతో జాతీయ ఉపాధి గ్రామీణ పథకంలో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,32,771 ఉపాధి జాబ్‌ కార్డులు ఉండగా, చేసిన పనికి కూలి సైతం సకాలంలో బ్యాంకు ఖాతా జమ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతున్నాయని కూలీలు వాపోతున్నారు. ఉపాధి కూలీలకు పెండింగ్‌ వేతనాలు చెల్లించడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించి, అదే విధంగా పనిముట్లు అందించి గిట్టుబాటు కూలి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 6న ఉపాధి కూలీలతో నారాయణపేట మునిసిపల్‌ పార్కు దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారం నుంచి ఉపాధి కూలీల వేతనాలు దాదాపు రూ.30 లక్షల వరకు కూలీల ఖాతాల్లో జమ కావల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజు 19వేల మంది కూలీలు ఉపాఽధి పనులు చేస్తుండగా, దినసారి కూలి రూ.183 పడుతుంది. తాజాగా ఏప్రీల్‌ 1వ తేదీ నుంచి దినసారి కూలి రూ.300 పెంచింది. అంతకుముందు రూ.272 చెల్లించనుండగా, కేవలం రూ.28 మాత్రమే పెంచింది. కూలి ధర పెంచినా చేసే పనికి కూలీలకు రూ.183 మాత్రమే పడుతుంది. గిట్టుబాటు కానీ కూలితో పాటు పని ప్రదేశంలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోతున్నారు. తాజాగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఊట్కూర్‌ మండలంలో ఉపాధి కూలీల పనులను పరిశీలించి పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

Updated Date - Apr 07 , 2024 | 10:36 PM