ర్యాలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతులేవీ?
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:41 PM
పాలమూరు ప్రాజెక్టుల పురోగతి కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే లు రెండు నెలల క్రితం గట్టు, నెట్టంపాడు ఎత్తి పోతల పథకాలపై సమీక్షించారు.
గద్వాల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాలమూరు ప్రాజెక్టుల పురోగతి కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే లు రెండు నెలల క్రితం గట్టు, నెట్టంపాడు ఎత్తి పోతల పథకాలపై సమీక్షించారు. అందులో ప్రా జెక్టుల ఈఎన్‌సీ ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలను అరికట్టేందుకు రెండు నెలల్లో టెండర్లు పిలిచి రబీలో పనులు ప్రారంభిస్తాం.. ఖరీఫ్‌లో నాలుగు టీఎంసీల నీరు నిల్వ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నిపుణులు సూచించిన మూడు ప్రతిపాదనల్లో ఒక్క దానిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఖరీఫ్ నాటికి కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నెట్టంపాడు ప్రాజెక్టులో ర్యాలంపాడు రిజర్వాయర్ గుండెకాయలాంటిది. ప్రాజెక్టు స్థిరీకరించిన ఆయకట్టు రెండు లక్షలు కాగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారనే 1.37 లక్షల ఎకరాలకు సాగురు అందాలి. అంతేకాకుండా ఐదు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను కూడా దీని ద్వారనే నింపాల్సి ఉంటుంది.
రెండేళ్ల క్రితమే నిపుణుల కమిటీ నివేదిక
ర్యాలంపాడు రిజర్వాయర్ 2012 నుంచి 2020 వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని అందించింది. 2020లో లీకేజీల సమస్య మొదలైంది. 2021నాటికి మరింత పెరిగి రిజర్వాయర్ కట్టపై వత్తిడి పెరిగింది. దానికి కిందనే ర్యాలయంపాడు గ్రామం ఉండటంతో 2021 అక్టోబరులో నిపుణుల కమిటీ పరిశీలించి నాలుగు టీఎం సీల నుంచి రెండు టీఎంసీలకు నిల్వ సామర్థ్యం తగ్గించి మరమత్తులకు నివేదించింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రతీ ఏడాది రబీలో క్రాప్ హాలి డే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం 2022 మా ర్చిలో సర్వే నిర్వహించేందుకు రూ.93 లక్షలతో టెండర్ల ద్వారా ప్రయివేటు ఏజెన్సీకు అప్పగించిం ది. అదే ఏడాది సెప్టెంబరులో నివేదిక ఇచ్చినా ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకోకుండా నాన్చు డు ధోరణి ప్రదర్శిస్తున్నారు.
రిజర్వాయర్ లీకేజీలను అరికట్టేందుకు నిపుణుల కమిటీ మూడు ప్రతిప్రాదనలు ఇరిగేషన్ అధికారుల ముందు పెట్టింది. మొదటిది రిజర్వాయర్ కట్ట రివిట్‌మెంటు తొలగించి సాంకేతికతో కూడిన మెమ్రిన్ షీట్‌లు వేసి గ్రావెల్ నింపి మళ్లీ కాంక్రీట్‌తో రివిట్‌మెంటు పర్చాలని ఇచ్చిన ట్లు తెలుస్తోంది. రెండోది ఎల్‌డీపీ షీట్ వేయ డం రిజర్వాయర్ కట్ట లీకేజీల వరకు తొలగించి ఎల్‌డీపీ షీట్ వేస్తూ మళ్లీ గ్రావెట్‌లో గట్టి పరు స్తూ రివిట్‌మెంటు వేయడం దీనికోసం రూ.153 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మూ డోది రిజర్వాయర్ కింది నుంచి గ్రౌటింగ్ చేస్తూ గ్రావెల్ నింపి కట్టను విస్తరింపజేయడం. ఇరిగేషన్ మంత్రి సమీక్షలో ఈఎన్‌సీ ఈ పద్ధతిలోనే పనులు చేసి ఖరీఫ్ నాటికి నాలుగు టీఎంసీలు నిల్వ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ మూ డింటిలో ఇప్పటి వరకు దేనిని ఫైనల్ చేయకపోవడంతో ఈ ఏడాది కూడా పనులు పూర్తయ్యేది కష్టమే అనిపిస్తున్నది.
గట్టు ఎత్తిపోతలకు ర్యాలంపాడే ఆధారం
కరువుపీడిత ప్రాంతమైన గట్టు, కేటీదొడ్డి మం డలాలను సస్యశ్యామలం చేసేందుకు రూ.553 కోట్లతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోథల పథకానికి ర్యా లంపాడు రిజర్వాయరే ఆధారం. దీని నుంచి 2.80టీఎంసీలను ఎత్తిపోసి 33వేల ఎకరాలకు సా గునీరు అందించాల్సి ఉంది. ఇందుకోసం గజ్జల మ్మ గుట్ట దగ్గర 1.32 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిని కూడా మంత్రులు పరిశీలించారు. ఇలా అన్నిటికీ ఆధారమైన ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీల సమస్యను పరిష్కరించకపోతే మొత్తం ప్రాజెక్టుపైనే ప్రభావం పడే సరిస్థితి ఉంది.
సాగునీటికి కష్టాలే
ర్యాలంపాడు రిజర్వాయర్ రెండు టీఎంసీలకు పరిమితం కావడంతో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 1.37లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. చివరి ఆయకట్టు రైతు లు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణానదికి వరదలు ఉన్నప్పుడే ఎత్తిపోసుకోవాలి. వరదలు తగ్గిపోతే ఎత్తిపోసే అవకాశం లేదు. ర్యాలంపాడు కింద ఉన్న ఐదు రిజర్వాయర్లను నింపుకొని ఖరీఫ్‌లో గట్టెక్కిన రబీలో సాగునీరు అందడం లేదు.