మూడు రోజుల వేడుకకు ముస్తాబు
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:38 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మూ డు రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఆర్‌ఐడీ(రాణి ఇందిరా దేవి) స్వర్ణోత్స వాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నవంబరు 27 నుంచి 29 వరకు ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాలు
దేశ విదేశాల నుంచి హాజరు కానున్న పూర్వ విద్యార్థులు
ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
కొల్లాపూర్, నవంబరు 25: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మూ డు రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఆర్‌ఐడీ(రాణి ఇందిరా దేవి) స్వర్ణోత్స వాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ప్రారంభం నాటి నుంచి నేటి వరకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను, వి ద్యార్థులను మరోసారి ఏకం చేసేలా ఈ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు, సినీ హీరో విజయ్ దేవరకొండ, వాగ్గే యకారులు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇండియన్ ఐడీఎల్ టీం సభ్యులు హాజరు కానున్నారని ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాల నిర్వాహకులు కటికనేని సాయి ప్రసాద్ వెల్లడించారు.
స్వర్ణోత్సవాల వివరాలు
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు. ఈ నెల 27 నుంచి 29 వరకు జరుగనున్నాయి. మొదటి రోజు 27వ తేదీన ముఖ్య అతిథులతో కొల్లాపూర్ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం స్వర్ణోత్సవాల సీడీ విడుదల, ముఖ్య అతిథుల ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం ఆర్‌ఐడీ అవార్డు బ్యాచ్‌ల వారీగా పరిచయ కార్యక్రమం, వాగ్గేయకారులతో ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి హరికృష్ణ టీం సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 28వ తేదీ ఉదయం సినిమా హీరో విజయ్ దేవర కొండ ఆర్‌ఐడీ పూర్వ విద్యార్థులతో పట్టణంలో ప్రభాత భేరీ నిర్వహించనున్నారు. అనంతరం పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం. పట్టణంలో పునర్నిర్మాణం చేసిన ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాల ప్రారంభం, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ పైలాన్ ఆవిష్కరణ ఉంటాయి. 29వ తేదీ చివరి రోజు ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు హాజరు కానున్నారు. ఉదయం మార్నింగ్ వెల్‌నెస్ రన్, పూర్వ విద్యార్థుల పరిచయ వేదిక, సాంస్కృతిక కార్య క్రమాలు కొనసాగుతాయి. స్వర్ణోత్సవాలను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని సురభిరాజా బంగ్లాలో సినిమా సెట్టింగ్‌లతో కూడిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేవలం ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు మాత్రమే పాల్గొనేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.