Share News

కాంగ్రెస్‌లో ముసలం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:24 PM

పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది.

కాంగ్రెస్‌లో ముసలం

- మొన్న గద్వాలలో చంద్రశేఖరెడ్డిపై సొంత పార్టీ నాయకుల దాడి

- నిన్న వనపర్తిలో ఎమ్మెల్యే ఎదుట గణేష్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నం

- వర్గాలుగా ఏర్పడి బహిరంగ, సోషల్‌ వార్‌కు దిగుతున్న నాయకులు

- వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి వర్సెస్‌ మేఘారెడ్డిగా మార్పు

- బీఆర్‌ఎస్‌ నాయకులను చేర్చుకుంటుండటంతో నారాజ్‌

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలే చింది. సొంత పార్టీలోనే నేతల మధ్య కుమ్ములాటలు మొదల య్యాయి. బహిరంగ విమర్శలతోపాటు సోషల్‌ వార్‌ను వర్గాలు ఏర్పడి మరీ కాంగ్రెస్‌ కార్యకర్తలు కొనసాగిస్తున్నారు. ఇది ప్రస్తు తం ప్రజల్లో కొంత నిరసక్తతను కలగజేస్తోందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉంటే.. ఓటర్లు 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులనే ఎమ్మెల్యేలుగా గెలిపించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తానికి మొత్తం స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకోగా.. ఇక్కడ పెద్దగా పార్టీ ఎమ్మెల్యే లు, నాయకుల మధ్య విభేదాలు లేవు. కానీ నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో మాత్రం విభేదాలు పెరుగుతున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా.. ఒకరు నిర్వహించిన కార్యక్రమానికి మరొకరు హాజరు కాకపోవడం ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మరీ ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. గద్వాల నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ గెలవకున్నప్పటికీ.. ఆ ఓటమే కొందరి మధ్య విభేదాలకు కారణమైం ది. సదరు అభ్యర్థి గెలిస్తే.. వారి వెంట నడిచేవారే.. ఇప్పుడు సొంతంగా తిరుగు తూ పక్కలో బల్లెంగా తయార య్యారనే వాదన వినిపిస్తోంది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో, ఆధిపత్యపోరు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతల మధ్య వైరం నడుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి.. పార్టీలు ప్రచార గోదాలోకి దిగిపోతున్న క్రమంలో అంతర్గత కుమ్ములాటలు పార్టీ అభ్యర్థిపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వస్తోంది.

గద్వాలలో అనిశ్చితి...

గద్వాల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సరితకు పార్టీ టిక్కెట్‌ కేటాయించడంతో చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో సరిత వెంట నడిచారు. అయితే సరిత గెలిస్తే.. ఆమె వెంటే నడిచేవారు కానీ బీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో సరితకు, చంద్రశేఖర్‌రెడ్డికి విభేదాలు వచ్చాయి. కొన్నాళ్లుగా బహిరంగ వేదికల మీదనే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారే తామే కాంగ్రెస్‌కు పెద్దదిక్కులం అని చెప్పుకుంటున్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం అలంపూర్‌లో మొదలవ్వగా.. అక్కడ వేదికపై పార్టీ ప్రొటోకాల్‌ విషయమై చంద్రశేఖర్‌రెడ్డి.. సరితను ప్రశ్నించారు. ఇదే క్రమంలో బుధవారం మల్దకల్‌లో ప్రచారం జరగ్గా.. అక్కడ కూడా ప్రచార వాహనం ఎక్కే విషయంలో వాగ్వాదం జరిగింది. పెద్దొడ్డి రామకృష్ణ అనే వ్యక్తితో జరిగిన సంభాషణ కాస్త తోపులాట, ముష్టియుద్ధంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్య పోరు కారణంగా పరిస్థితి గందరగోళంగా తయారైంది. రానున్న రోజుల్లో ఇది పార్టీలో మరింత అనిశ్చితికి కారణమవుతుందనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం కూడా వర్గాల మధ్య విభేదాలపై దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వనపర్తిలో తారస్థాయికి..

వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికలకు కొద్దినెలల ముందే ప్రస్తుత ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి వరకు టిక్కెట్‌ రేసులో ఉన్న చిన్నారెడ్డికే కాంగ్రెస్‌ పార్టీ రెండో విడతలో టిక్కెట్‌ కేటాయించగా.. మూడో విడత వచ్చే సరికి ఆ టిక్కెట్‌ను మేఘారెడ్డికి పార్టీ కేటాయించింది. ఇక అప్పటి నుంచే ఇరువురి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ దుందుభీ మోగించడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. తాను పోటీలో ఉంటే మంత్రిని అయ్యేవాడినని చిన్నారెడ్డి భావించారు. ఇక అప్పటి నుంచి అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన అనంతరం విజయోత్సవ ర్యాలీలో మేఘారెడ్డి నవంబరు 30 వరకు తన వెంట ఉన్నవారే కార్యకర్తలని.. వారికే పార్టీ పదవులు, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అలాగే కార్యకర్తల ఆమోదం లేకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకోబోమని కూడా స్పష్టం చేశారు. అయితే చిన్నారెడ్డి బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే దృష్టిలో లేకుండా నిర్ణయం తీసుకోవడంతో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి వర్గీయులు గుస్సాగా ఉన్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, ఎమ్మెల్యే చేర్చుకోపోతే చిన్నారెడ్డి ద్వారా పార్టీలోకి రావడం, చిన్నారెడ్డి చేర్చుకోకపోతే మేఘారెడ్డి ద్వారా పార్టీలోకి చేరిపోవడంతో వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో తాడిపర్తి మాజీ సర్పంచ్‌ గణేష్‌గౌడ్‌ తమ గ్రామానికి చెందిన లోకారెడ్డిని చేర్చుకోవద్దని గురువారం పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఎమ్మెల్యే వర్గీయులు కాంగ్రెస్‌ నేతలను వేధించిన జానకీరాంరెడ్డిని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే వర్గీయులు రచ్చకు దిగుతున్నారు. చిన్నారెడ్డి గతంలో చెప్పిన మాటలు, ప్రస్తుతం పనులను ఊటంకిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ రచ్చ ఇప్పట్లో తగ్గేట్లు లేదు. పైగా వ్యవహారం చిన్నారెడ్డి వర్సెస్‌ మేఘారెడ్డిగా మారడంతో భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

Updated Date - Apr 18 , 2024 | 11:24 PM