Share News

ఎంపీ రాములు పార్టీ మార్పు

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:14 PM

భారత రాష్ట్ర సమితి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు పార్టీని వీడనున్నారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని భావిస్తున్న ఆయన కారు దిగడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎంపీ రాములు పార్టీ మార్పు
ఎంపీ రాములు

రెండు రోజుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం

ఆ తర్వాత కాంగ్రెస్‌ లేదా బీజేపీ వైపు అడుగులు?

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్ర సమితి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు పార్టీని వీడనున్నారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని భావిస్తున్న ఆయన కారు దిగడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌ లేదా బీజేపీ వైపు ఆయన అడుగులు పడనున్నాయని సమాచారం.

సమాచారం ఇవ్వకపోవడంపై కోపంలో రాములు

సీనియర్‌ పొలిటిషియన్‌తో పాటు గతంలో మంత్రిగా, అచ్చంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన తనకు పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై రాములు కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దుర్మార్గమైన చర్య తనను మానసికంగా కలిచివేసిందని తన అనుచరుల వద్ద మదనపడినట్లు సమాచారం. వాస్తవంగా నిన్ననే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రాములు నిర్ణయం తీసుకున్నా.. ఆయన వెన్నంటే ఉన్న కార్యకర్తలు సముదాయించినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను రూపొందించుకుందామని అనుచరులు ఇచ్చిన సలహాతో ఆయన వెనక్కి తగ్గారు.

భరత్‌కు టికెట్‌ ఇస్తేనే?

బీఆర్‌ఎస్‌ను వీడాలని తనకు మనసులో లేకున్నా.. తప్పనిసరి పరిస్థితులు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాయని, తన కుమారుడు భరత్‌ప్రసాద్‌కు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే పార్టీలోనే కొనసాగాలని రాములు నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ పార్టీ మారాలనుకుంటే అటు కాంగ్రెస్‌ లేదా బీజేపీల వద్ద ఒక కండీషన్‌ విధించినట్లు సమాచారం. తన కుమారుడు భరత్‌ప్రసాద్‌కు టికేట్‌ ఇస్తే తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటానని కూడా ఆయా పార్టీల అధిష్ఠానాలతో వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎంపీ రాములు త్వరితగతిన రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Feb 26 , 2024 | 11:14 PM