Share News

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:40 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా

- ఉమ్మడి పాలమూరులో బీఆర్‌ఎస్‌కే అధిక బలం

- గతంలో ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఏకగ్రీవమే

- ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీ..

- కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి దాదాపు ఖరారు

- బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యేల ఆసక్తి

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. ఇక్కడి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ రకంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. ఒక ఎమ్మెల్సీ స్థానంలో కూచకుళ్ల దామోదర్‌ రెడ్డి కొనసాగుతు న్నారు. ఆయన బీఆర్‌ఎస్‌ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ.. తర్వాత కాంగ్రెస్‌లో చేరడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఆయన పదవికి వచ్చినా ఢోకా లేదు. ఈ నేపథ్యంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు రంగం సిద్ధం కాగా.. గతంలో ఈ రెండు స్థానాలు బీఆర్‌ఎస్‌ తరపున ఏకగ్రీవమైనవే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ సభ్యు లే అధికంగా ఉండటంతో గతంలో ఇతర పార్టీలు అభ్యర్థులను కూడా నిలబెట్టలేని పరిస్థితి ఉండేది. అయి తే ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కే అధిక బలం ఉంది. కొత్తగా గెలిచిన కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను చేర్చు కోమని, తమ వెంట నడిచిన వారికి ప్రాధాన్యం ఇస్తామనడంతో చాలామంది చేరడానికి సిద్ధంగా ఉన్నా.. చేరికలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రావడంతో బలం పెంచు కోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై ఉండనుంది. ఒకవేళ బలం పెంచుకోలేకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందడం తథ్యమనే చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం.. పార్లమెంట్‌ ఎన్నికలు ముంగిట ఉండటంతో ఈ స్థానాన్ని గెలవడం పార్టీకి చాలా ముఖ్యం.. ఒకవేళ బలం లేదని అభ్యర్థిని నిలపకపోయినా.. లేదా నిలిపి ఓటమి చెందినా.. దాని ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి స్థాని క సంస్థల్లో భాగమైన ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూన్‌తో ముగు స్తుంది. కౌన్సిలర్ల పదవీ కాలం మరో ఎనిమిది నెలలు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

ఎమ్మెల్సీపై చాలామందిలో ఆశలు..

రెండు పర్యాయాలుగా ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమవుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ సభ్యులు అధికంగా ఉండటం వల్ల పార్టీ ఎవరి కి టిక్కెట్‌ ఇస్తే వారే గెలిచే పరిస్థితు లు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటంతోపాటు.. చాలామంది స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపు తుండటంతో ఆ పార్టీ తమ అభ్యర్థిని నిలపనుంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా చల్లా వంశీ చంద్‌రెడ్డి పేరును ఖరారు చేయగా.. పార్టీలో చేరిక సమయంలోనే అధిష్టానం జీవన్‌ రెడ్డికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి చాలామంది ఆశావహులు ఎమ్మెల్సీ టికెట్‌ రేసులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయిం చేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ సూచించి నా.. వారు పోటీకి వెనకడుగు వేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుత ఎంపీకే టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం చాలామంది మాజీ ఎమ్మెల్యేలు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇందు కు స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ బలం అధికంగా ఉండడ మే అని చెప్పవచ్చు. ఇప్పటివరకు బహిరంగంగా ఎవ రూ ప్రకటించకపోయినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యేల అను చరులు సోషల్‌ మీడియాలో తమ నాయకుడే పోటీచేస్తారనే సందేశాలు పెడుతున్నారు.

అధికబలం బీఆర్‌ఎస్‌కే...

ఉమ్మడి పాలమూరులో అయిదు జిల్లాలు ఉండగా.. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో 14 మండలాల చొప్పున, గద్వాల జిల్లాలో 12 మండలాలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 20 మండలాలు, నారాయణపేట జిల్లాల్లో 11 మండలాలు ఉన్నాయి. ఇందులో కొత్తగా కొన్ని మండలాలు ఏర్పడినా.. ఇంకా పాత మండలాల వారీగానే స్థానిక సంస్థలు కొనసాగుతున్నాయి. అలాగే ఉమ్మడి పాలమూరులో 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 95శాతం కంటే ఎక్కువగా బీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులే గెలిచారు. కొందరు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా.. కొన్ని స్థానాలకు రాజీనామా, కొందరు చనిపోవడంతో ఖాళీ స్థానాలు ఉన్నాయి. అయినప్పటికీ స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ బలమే ఎక్కువగా ఉంది. దాదాపు 70శాతం పైగా ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. మొన్నటివరకు పార్టీలో చేరడానికి స్థానిక సంస్థల సభ్యులు క్యూ కడితే ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తిరస్కరించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారి వద్దకు కాంగ్రెస్‌ నేతలు క్యూ కట్టే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇప్పుడు వారిని పార్టీలోకి తీసుకువచ్చి.. బలం పెంచుకోవడం ఎమ్మెల్యేలపై భారం కానుంది.

ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల : కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌): మహబూబ్‌నగర్‌ స్థాని క సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక మార్చి 28న నిర్వహించేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం (ఈసీఐ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవినాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికల కు సంబంధించిన నోటిఫికేషన్‌ మార్చి 4వ తేదీన ఎన్ని కల సంఘం విడుదల చేసిందని తెలిపారు. షెడ్యూల్‌ విడుదలతో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసనమండలి పరిధిలోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ తక్షణం అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 4వ తేదీన నోటిఫికేషన్‌ జారీ, నామి నేషన్లకు తుది గడువు మార్చి 11, మార్చి 12న నామినే షన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 తుది గడువు, మార్చి 28 ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్‌, ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు, ఏప్రిల్‌ 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్‌ అనుమతులు, వాహన అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పొందాల ని తెలిపారు.

Updated Date - Feb 27 , 2024 | 11:40 PM